గన్స్ వాడటంలో శిక్షణేం తీసుకోలేదు
‘పోకిరి’ సినిమాలో “గన్ అలవాటుందా..?” అనే ప్రశ్నకు “సినిమాలు చూడట్లేదేంటి” అని సమాధానమిచ్చారు మహేశ్‌బాబు. సినిమా సంగతి అలా ఉంచితే, నిజ జీవితంలోనూ ఆయనకి ఇదే ప్రశ్న ఎదురైంది. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘హరోం హర’. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. సుధీర్ సినిమాలకు ముందు నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్న మహేశ్ ఈ వేడుకకి హాజరు కానప్పటికీ, సుధీర్‌తో జరిపిన కొన్ని ముచ్చట్లను పంచుకుని అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ‘హరోం హర’ సినిమాలో తుపాకీ తయారీ ప్రస్తావన ఉండటంతో “సినిమాల్లో మొదటిసారి గన్స్ ఉపయోగించినప్పుడు ఎలా అనిపించింది?” అని మహేశ్‌ని ప్రశ్నించారు సుధీర్‌బాబు.
బదులుగా “గన్స్ ఉపయోగించటంపై ప్రత్యేక శిక్షణేం తీసుకోలేదు” అన్న మహేశ్, తనకు ఎంతో ప్రత్యేకమైన ‘టక్కరి దొంగ’ సినిమాలో ఎక్కువగా గన్స్ వాడామని, ఆ సినిమా చేస్తున్నంత సేపు తండ్రి (కృష్ణ) చేసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాయే గుర్తుకు వచ్చేదని చెప్పుకొచ్చారు. “‘నిజం’ సినిమా విశేషాలేమైనా గుర్తున్నాయా?” అని సుధీర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఆ సినిమాలోని భావోద్వేగాలతో కూడిన ఇంటర్వెల్ సీన్ గురించి చెప్పారు. దీనిపై స్పందించిన సుధీర్‌బాబు తన తర్వాతి సినిమా “మా నాన్న సూపర్ హీరో’లోనూ అలాంటి ఓ సన్నివేశం ఉంటుందన్న విషయాన్ని బయటపెడుతూ, సినిమాలో ఆ సీన్ చూసిన ప్రేక్షకులు ‘నిజం’ సినిమాను గుర్తు చేసుకుంటారేమో” అని ఆ సినిమాపైనా అంచనాలు పెంచారు.






