4 April, 2026 | 2:35 AM

పట్టణ సుందరీకరణలో కీలకంగా గుడి చెరువు అభివృద్ధి

04-04-2026 12:44 AM

* మురుగునీరు తొలగింపుతో శుభ్రతకు శ్రీకారం 

* వేములవాడ మున్సిపల్ చైర్మన్ : పుల్కం రాజు 

వేములవాడ, ఏప్రిల్ 3,(విజయక్రాంతి): వేములవాడ పట్టణ సుందరీకరణలో భాగంగా గుడి చెరువుకు కొత్త రూపు ఇవ్వడానికి మున్సిపాలిటీ చర్యలు వేగవంతమయ్యాయి. రాజన్న క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు గుడి చెరువును అభివృద్ధి చేసే పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.చెరువులోకి పట్టణంలోని మురుగు నీరు చేరకుండా నిరోధించేందుకు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు గుడి చెరువు నుండి మూల వాగు వరకు అండర్గ్రౌండ్ పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పవిత్రమైన గుడి చెరువు కలుషితం కాకుండా సంరక్షించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో భారీ నిధులతో డ్రైనేజీ మళ్లింపు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పనులు పూర్తయ్యాక గుడి చెరువు పర్యాటక కేంద్రంగా మారుతుందని, పట్టణ సుందరీకరణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రతి వార్డులో సమస్యల పరిష్కారంతో పాటు ముఖ్య ప్రాంతాలను ఆధునీకరించేందుకు మున్సిపాలిటీ కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు.ఈ తనిఖీలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, 17వ వార్డు కౌన్సిలర్ ముత్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.