ఆర్టీసీ డీఎం హెచ్చరించి 24 గంటలు గడవక ముందే ప్రమాదం
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు
అయిజ ఏప్రిల్ 3: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు సంఘటన శుక్రవారం అయిజ మున్సిపాలిటీలోని కొత్త బస్టాండ్ దగ్గర చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు TS 33 T 0494 నెంబర్ గల ఆర్టిసి బస్సు అతి వేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నదని, తృటిలో ప్రమాదం తప్పి స్వల్ప గాయలతో అబ్బాయి బయట పడ్డాడని, లేకపోతే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందేవాడని అన్నారు.
రహదారి సర్వేలో భాగంగా ఆర్టీసీ డిఎం సునీత 2 వ తేదీన సాయంత్రం అయిజ ఆర్టీసీ బస్టాండ్ తనిఖీ నిర్వహించి, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి 24 గంటలు గడవకముందే, ప్రమాదం జరగడం డ్రైవర్ల నిర్లక్ష్యమా ?లేక పైఅధికారుల హెచ్చరికలు లెక్కలేనితనమా ? అంటూ ప్రజలు మండిపడుతున్నారు. కొందరు డ్రైవర్లు ర్యాస్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలు ఎక్కి దిగేటప్పుడు వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, బస్ స్టాప్ లో ఆడవారు కనిపిస్తే ఫ్రీ టికెట్టే కదా అంటూ ఆపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
ఈ మధ్యనే గద్వాలలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు విద్యార్థులు మరణించడం, ఇప్పటికీ ఒక విద్యార్థి చావు బతుకుల తో పోరాడుతున్నాడు. ఇంత జరిగిన డ్రైవర్ల నిర్లక్ష్యం ఎటువంటి అనర్థాలకు దారితీస్తుందో అని ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఏది ఏమైనా డ్రైవర్లు రోడ్డుపై వెళ్లే ప్రజలను దృష్టిలో ఉంచుకొని సమయస్ఫూర్తి నేర్పరితనంతో బస్సులు నడిపి ప్రజల ప్రాణాలు కాపాడాలని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




