5 May, 2026 | 6:13 AM

రైతుల కోరిక మేరకు సాగునీటి విడుదల

24-06-2024 03:26 AM
  • సీఎం రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం
  • బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం  

కామారెడ్డి, జూన్ 23 (విజయక్రాంతి): రైతుల కోరిక మేరకే నిజాంసాగర్ సాగునీరు విడుదల చేశామని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయకట్టు రైతులు, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల రైతులు రుణపడి ఉన్నామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, జెడ్పీ చైర్‌పర్సన్ దాపేదార్ శోభరాజుతో కలిసి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. 1932లో నిజాంసాగర్ నిర్మించారని,  2.70 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేదని.. ప్రాజెక్ట్‌లోకి నీళ్లు సరిగా రాకపోవడంతో ఆయకట్టు తగ్గిపోయిందని చెప్పారు.

ప్రస్తుతం అలీసాగర్ వరకు ఉన్న 1.30 లక్షల ఎకరాలు నిజాంసాగర్ పరిధిలో ఉన్నాయని, మొత్తం 10 మండలాల పరిధిలో వరి సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మొదటగా ఈ ప్రాంతంలోని రైతులు రోహిణి కార్తెలోనే నార్లు పోసి త్వరగా నాటు వేసుకుంటారని చెప్పారు. రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సాగునీటిని విడుదల చేసిందని స్పష్టంచేశారు. విడతల వారీగా నీటిని విడుదల చేస్తామని, మొదటి విడతలో భాగంగా ఆదివారం నుంచి 1400 క్యూసెక్యులను విడుదల చేస్తున్నామని వివరించారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు.