వారంలోపు ధరణి సమస్యలను పరిష్కరించాలి
కలెక్టర్ రాహుల్ రాజ్
వెల్దుర్తి, జూన్ 28 (విజయక్రాంతి): వారంలోపు ధరణిలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. తహసీల్దార్లు రోజువారీగా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. వాటి కోసం అదనపు సమయం కేటాయించాలన్నారు. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వంద దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. దవాఖానలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. పర్యటనలో తహసీల్దార్ తులసీరాం, అధికారులు పాల్గొన్నారు.




