28 August, 2026 | 10:12 PM

మైదానంలో గంట.. ఆరోగ్యం మీ వెంట

28-08-2026 07:17 PM

ఘనంగా ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు 

సుల్తానాబాద్‌,(విజయక్రాంతి): జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఖేల్‌ ఇండియా సెంటర్‌లో  వివిధ క్రీడా కార్యక్రమాలునిర్వహించారు.స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్‌ అనుమతితో జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.తొలిరోజు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం క్రీడాకారులు, విద్యార్థులకు వివిధ క్రీడలు, వ్యాయామాలపై అవగాహన కల్పించారు. ‘ఏక్‌ గంట్‌ ఖేల్‌ కే మైదాన్‌ మే’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ రోజూ కనీసం గంటసేపు మైదానంలో క్రీడలు, వ్యాయామానికి కేటాయించాలని సందేశమిచ్చారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సుల్తానాబాద్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అంతటి పుష్పలత మాట్లాడుతూ.. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఒత్తిళ్లకు గురవుతున్నారని, ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరమన్నారు.

ఈ నెల 30వ తేదీ వరకు జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి ఏ. సురేష్‌, సుల్తానాబాద్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్‌, కార్యదర్శి అమీరిశెట్టి తిరుపతి, సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ అంతటి శంకరయ్య, కోచ్‌ గెల్లు మధుకర్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు టి. ప్రణయ్‌, కె. వెంకటేష్‌, రాకేష్‌, అజ్జు, ఎల్లరాజు, సాధుల సుగుణాకర్‌, ఆయుబ్‌ తదితరులు పాల్గొన్నారు.