28 August, 2026 | 10:58 PM

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పౌర్ణమి ఆత్మీయ ప్రతీక

28-08-2026 09:55 PM

నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగను నాగిరెడ్డిపేట మండలంలో అన్ని గ్రామాల్లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే పండుగ సందడి నెలకొంది. దూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఆడపడుచులు తమ సోదరుల ఇళ్లకు చేరుకుని ప్రేమతో రాఖీలు కట్టారు. సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి జీవితాంతం ప్రేమగా,ఆప్యాయంగా తోడుగా ఉండాలని ఆకాంక్షించారు.

సోదరులు కూడా తమ సోదరీమణుల పట్ల ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని హామీ ఇస్తూ ఆప్యాయంగా కానుకలు అందజేశారు. దీంతో ప్రతి ఇంటా ఆనందం,ఆత్మీయత వెల్లివిరిసింది.రాఖీ దారంలో ముడిపడేది కేవలం మణికట్టు కాదు. జీవితాంతం నిలిచే అనుబంధం కాలం మారినా, దూరాలు పెరిగినా అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలు చెరిగిపోవని చాటుతూ రాఖీ పౌర్ణమి వేడుకలు కుటుంబాల్లో సంతోషాన్ని నింపాయి.

రాఖి పండుగ సందర్భంగా మార్కెట్లలో రాఖీలు, స్వీట్లు, పండ్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి నెలకొంది. సోదరసోదరీమణుల అనురాగ బంధాన్ని మరింత బలపరిచేలా రాఖీ పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దూర ప్రాంతాల నుండి ఆడపడుచులు రావడంతో నాగిరెడ్డిపేట్ మండలంలోని అన్ని గ్రామాల్లో సందడిగా ఏర్పడింది. ఉచిత బస్సు ప్రయాణం కావడంతో ప్రతి ఒక్క ఆడపరచు సోదరుని ఇంటికి చేరుకొని రాఖీలు కట్టారు.జనాలతో బస్సులు కిక్కిరించిపోయాయి.