అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
28-08-2026 10:11 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న ఘటన బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గొమ్మూరు వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు రేషన్ బియ్యాన్ని కిలో రూ.17 చొప్పున కొనుగోలు చేసి టాటా మ్యాజిక్ వాహనంలో తరలిస్తున్నాడు. మొత్తం 10 బస్తాల్లో సుమారు 5 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మేడ ప్రసాద్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని వాహనాన్ని తనిఖీ చేశారు.వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని, టాటా మ్యాజిక్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.






