1 July, 2026 | 1:44 AM

అక్కడ వజ్రాలు ఇక్కడ బంగారం దొరుకును !

01-07-2026 12:50 AM
  1. మధ్యప్రదేశ్‌లోని అహిర్‌గావ్ వజ్రాలకు ప్రసిద్ధి
  2. భూమిని తవ్వి ౩౦ లక్షల విలువైన వజ్రాన్ని వెలికితీసిన యువకుడు
  3. తెలంగాణలోనూ అదే తరహా ఘటన
  4. మానుకోట జిల్లా చెన్నారావుపేటలో గోల్డ్ ఆభరణాలు లభ్యం

హైదరాబాద్, జూన్ ౩౦ (విజయక్రాంతి)/ భోపాల్: వ్యవసాయ భూముల్లో సాధారణంగా పంటలు పండుతాయి. కొన్నిచోట్ల మాత్రం మణులూ మాణిక్యాలు దొరుకుతున్నాయి. ఒక చోట కోట్లు విలువ చేసే వజ్రాలు దొరికితే, మరోచోట పురాతన కాలం నాటి బంగారం బయటపడింది. ఆ ప్రదేశాలు ఎక్కడ అంటారా? మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో స్థానికులకు వజ్రాలు దొరకగా, తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో స్థానికులకు బంగారు ఆభరణాలు దొరికాయి.

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా అహిర్‌గావ్ ప్రాంతం వజ్రాలకు ప్రసిద్ధి. ఈ భూమిలో వజ్రాయలు దొరుకుతాయని స్థానికుల విశ్వాసం. ఇదే గ్రామానికి చెందిన రాకేశ్ రెండు నెలలు శ్రమించి భూమిని తవ్వాడు. రాళ్లూ రప్పలు తవ్వుతూ ఓపిగ్గా తవ్వుతూ వెళ్లాడు. రాకేశ్‌కు చివరకు ౧౧ క్యారట్ల బరువున్న వజ్రం దొరికింది. వజ్రం విలువ మార్కెట్‌లో రూ.౩౦ లక్షల ఉంది. అక్కడి యంత్రాంగం ఆ వజ్రాన్ని స్వాధీనం చేసుకుంది. త్వరలో వేలం వేయనుంది. వచ్చిన మొత్తంలో కొంత పారితోషికాన్ని రాకేశ్‌కు అప్పగించనుంది.

దీంతో రాకేశ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ కుటుంబానికి అదృష్టం కలసిరావడం ఇదే మొదటిసారి కాదు. ౨ సంవత్సరాల క్రితం ఆ కుటుంబానికి రూ.౯౩ లక్షల వజ్రం దొరికింది. ప్రభుత్వం వేలం వేయగా, కుటుంబానికి పారితోషికం లభించింది. దీంతో వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. పన్నా జిల్లాలో ఎవరైనా లీజుకు భూమిని తీసుకోవచ్చు. అందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని నిర్దేశిత ఫీజు చెల్లిస్తే చాలు.

అలా చేస్తే దరఖాస్తుదారు ఏడాది పాటు భూమి వెళ్తుంది. అది మొదలు దరఖాస్తుదారు నిధి నిక్షేపాల కోసం వేట సాగించవచ్చు. అలా రాకేశ్ కుటుంబానికి రెండుసార్లు అదృష్టం కలిసివచ్చిందన్నమాట. ఇటు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోనూ ఇటీవల స్థానికులకు బంగారు ఆభరణాలు లభించాయి. గ్రామానికి చెందిన ఓ రైతు ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. పొలం పనుల్లో భాగంగా కూలీలు కలుపు తీస్తుండగా, భూమిలో కొన్ని బంగారు నగల ముక్కలు లభించాయి.సమాచారం అందుకున్న పోలీసులకు సమాచారం అందించారు.

వారు ఆభరణాలను ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఇదే ప్రాంతంలో వందల ఏళ్ల క్రితం ప్రాచీన ఆలయాలు ఉండేవని, నాటి ఆభరణాలే నేడు బయటపడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ౩౦ ఏళ్ల క్రితం ఓ కూలీకి కూడా ఇదే తరహాలో బంగారం దొరికిందని గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు, తాజాగా బంగారం దొరికిన తర్వాత రాత్రిళ్లు కొందరు బంగారు ఆభరణాల కోసం వేట సాగిస్తున్నట్లు తెలిసింది.