20 May, 2026 | 2:18 PM

తండేల్ మెప్పించిందా?

08-02-2025 12:00 AM

చిత్రం: తండేల్, స్క్రీన్‌ప్లే, నటీనటులు: నాగ చైతన్య, సాయిపల్లవి, కరుణాకరణ్ తదితరులు దర్శకత్వం: చందు మొండేటి, నిర్మాత: బన్ని వాసు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సమర్పణ: అల్లు అరవింద్, కథ: కార్తిక్

ఎందుకోగానీ నాగచైతన్యకు ఆ మధ్య కాస్త గడ్డుకాలమే నడిచింది. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఎంతో నమ్మకంతో ఒక రియల్ స్టోరీతో.. హీరోయిన్ సాయిపల్లవితో కలిసి బరిలోకి దిగాడు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను తండేల్ అందుకున్నాడా? 

ఇదీ కథ.. 

మత్యకారులందరినీ ముందుకు నడిపించే నాయకుడిని తండేల్ అంటారు. అలా రాజు (నాగ చైతన్య) తండ్రి తండేల్. ఆయన స్ఫూర్తితో రాజు కూడా తోటి మత్స్యకారుల సాధకబాధకాలను తెలుసుకుంటూ వారికి అండగా నిలిచి తండేల్ అవుతాడు. మరోవైపు చిన్నప్పటి నుంచి రాజుకు సత్య(సాయి పల్లవి) అంటే ప్రాణం. ఆమెకు కూడా రాజు అంటే విపరీతమైన ప్రేమ.

వారితో పాటే వారి ప్రేమ కూడా పెరిగి పెద్దదవుతుంది. అయితే చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మరణించడంతో రాజును కూడా చేపల వేటకు వెళ్లొద్దని సత్య పట్టుబడుతుంది. అయినా సరే.. రాజు వెళతాడు.

అలా వెళ్లిన రాజు తుపానులో చిక్కుకున్న వారిని రక్షించే క్రమంలో పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి అధికారులకు తన బృందంతో సహా పట్టుబడతాడు. వారిని బంధీలుగా చేసి అక్కడి జైల్లో వేస్తారు.

రాజు కోసం సత్యం ఏం చేసింది? రాజు తన మాట వినలేదని వేరే పెళ్లికి సిద్ధమైన సత్య చివరకు ఏం చేసింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే... 

సినిమా మొత్తం లవ్ స్టోరీ పైనే ఆధారపడి దర్శకుడు చందూ మొండేటి నడిపించారు. రియల్ స్టోరీకి.. లవ్ టచ్ ఇచ్చి ఉంటే సినిమా రేంజ్ మారిపోయేది. కానీ లవ్ స్టోరీ కోసం రియల్ స్టోరీ పాయింట్ ఒకటి వాడుకున్నారు. అంటే మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు పట్టుకోవడం.. వారిని భారత్ ఎంబసీ విడిపించడం.

మిగిలినదంతా కార్తిక్ రాసిన కథ ప్రకారం నడుస్తుంది. రొటీన్ లవ్ స్టోరీ. దీనికి పాటలు హైలైట్‌గా నిలిచాయి. చాలా కాలం తర్వాత దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఈ సినిమాకు సమకూర్చారు.

ప్రతి పాట ఆకట్టుకుంటుంది. తుపాను ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. మిగిలిదంతా ప్రేక్షకుడి ఊహలకు అందుతూనే ఉంటుంది. నాగచైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్.

నటనపరంగానూ వీరిద్దరూ పోటీపడి మరీ నటించారు. డ్యాన్స్ కూడా సాయిపల్లవికి ఏమాత్రం తీసిపోకుండా నాగచైతన్య చేశాడు. కొంతమేర రియల్ స్టోరీకి ప్రాధాన్యమిచ్చి ఉంటే బాగుండేది.