3 May, 2026 | 8:51 PM

కేసీఆర్ కుటుంబం సోనియా కాళ్లు మొక్కలేదా?

10-12-2024 12:56 AM
  1. సోనియమ్మ దేవత అన్నారు.. 
  2. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉండేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చాక కేసీఆర్‌తో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం 14 మంది ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ కాళ్లు మొక్కలేదా? అని మంత్రి ప్రశ్నించారు.

సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత అని, ఆమె లేకపోతే తెలంగాణ రాకపోయేదని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని అడిగారు. ‘మేం  పార్టీకి టీపీసీసీ అని చెప్పుకొంటాం.. మీరు మీ పార్టీలో టీ తీసేసి బీఆర్‌ఎస్ అని పెట్టుకున్నారు.

దీంతో బీఆర్‌ఎస్‌కు తెలంగాణతో సంబంధం లేకుండా పోయింది’ అని విమర్శించారు. తాను నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే సమీక్షకు రాలేదని, మా పార్టీకి చెందిన ఆర్మూర్ ఇన్‌చార్జి వచ్చి రోడ్డు సమస్య ఉందని చెప్పారని, అందులో తప్పేమీ లేదన్నారు.  తన కొడుకు మృతితో ఎంత బాధపడ్డానో బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పూర్తిచేయాలని అంతే బాధపడ్డాను అని మంత్రి పేర్కొన్నారు.