అంగన్‌వాడీలకు అందని యూనిఫాం
*8 వేల మంది చిన్నారులకు 4 వేల దుస్తులే..
వనపర్తి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా దుస్తులు పంపకపోవడంతో వచ్చిన దుస్తులను చిన్నారులందరికీ పంపిణీ చేయడం ఎలా అంటూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తలమునకలు అవుతున్నారు. వనపర్తి జిల్లాలో 589 అంగన్‌వాడీ కేంద్రాలనుగాను 8 వేల మంది చిన్నారులు హాజరవుతున్నట్లు అధికార లెక్కలు ఉన్నాయి.
ప్రభుత్వం నుంచి కేవలం 4 వేల ఏకరూప దుస్తులే వచ్చాయి. విద్యార్థులు ఉన్న సంఖ్యకు కేవలం 50 శాతం మాత్రమే పంపడంతో ఆయా మండలాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు ఎంత మేర పంపా లో అర్థంకాక అధికారులు సతమతమవుతున్నారు. దీంతో సగం మంది చిన్నారులకు ఇచ్చి మిగిలిన వాళ్లకు ఇవ్వకుండా ఉండాలా లేదంటే మిని అంగన్‌వాడి కేంద్రంలో చిన్నారులందరికీ ఇవ్వకుండా ఆపాలా వంటి ప్రశ్నలతో అంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్త పంచాయతీ ఏర్పడనుంది.
త్వరలోనే మిగిలిన వారికి పంపిణీ చేస్తాం
జిల్లాలో మొత్తం 8 వేల చిన్నారులు ఉండగా కేవ లం 4 వేల ఏకరూప దస్తులు మాత్రమే వచ్చాయి. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని పంపిణీ చేస్తాం. మిగిలిన చిన్నారులకు ప్రభుత్వం నుంచి త్వరలోనే వచ్చే దుస్తులను పంపిణీ చేస్తాం.
- లక్ష్మమ్మ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి, వనపర్తి






