21-02-2026 02:16:52 AM
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి)/పెద్దకొత్తపల్లి/సంస్థాన్‌నారాయణపూర్: రాష్ట్రంలో యూరియా కొరత రైతులను మళ్లీ వేధిస్తున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో యూరి యా కొరత ఏర్పడటంతో శుక్రవారం రైతులు సింగిల్ విండో కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ ఉన్నప్పటికీ, యూరియా పొందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యా లయం వద్ద రైతులు వేచి ఉండగా, ఉదయం 10.30 గంటలకు యూరియా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది.
అయితే, కేవలం రెండు నిమిషాల్లోనే 900 బస్తాలు బుక్ అయినట్లు యాప్‌లో చూపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో క్యూ లైన్ మద్దు, ఆన్‌ఐలన్ వద్దు అంటూ ధర్నా చేపట్టారు. యాప్ ద్వారా కాకుండా మాన్యువల్ విధానంలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు.
నిమిషాల్లో బుకిం గ్ పూర్తవడం అనుమానాస్పదమని, యాప్లో యూరియా కనిపించకపోవడంతో ఆగ్రహించిన రైతులు సింగిల్ విండో కార్యాలయానికి తాళం వేశారు. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం వల్ల యాప్ ద్వారా బుక్ చేసుకోలేకపోతున్నామని, చిన్న ఫోన్లు ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కొందరు రాజకీయ నాయకుల అనుచరులకే యాప్ ద్వారా యూరియా దక్కు తుందని ఆరోపించారు.
ఏడిపించిన ఎరువుల యాప్
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని సర్వేలు గ్రామానికి చెందిన ఎనుముల దామోదర్‌రెడ్డి తనకున్న ఐదెకరాల పొలంలో వరి వేశాడు. యూరియా కోసం గత మూడు రోజులుగా సర్వేలులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చుట్టూ తిరిగినప్పటికీ దొరకలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ ద్వారా మాత్రమే యూరియా పంపిణీ చేస్తామని సిబ్బంది తేల్చి చెప్పారు.
చదువురాని దామోదర్‌రెడ్డి ఫోన్‌లో యాప్ ద్వారా యూరియా బుక్ చేయడం తెలియక అధికారులను ఎంత బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. ఓ వైపు ఎదుగుదల లేక ఎర్రబారిన వరిపైరు, మరో వైపు యూరియా దొరకని పరిస్థితి, దీనికి తోడు ఎవరు బుక్ చేయడంలో సహాయం చేయకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితిలో రైతు తీవ్ర మనోవేదనతో శుక్రవారం కన్నీరు కార్చాడు.