9 June, 2026 | 1:18 AM

డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

09-06-2026 12:14 AM

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్లలో బీఆర్‌ఎస్ సమన్వయ కమిటీ సమావేశం విజయవంతం

మొయినాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): చేవెళ్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో గల పి.వి. కన్వెన్షన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఐఆర్  ప్రక్రియతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని, ప్రతి నాయకుడు, కార్యకర్త దీనిని బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆమె పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి దిశానిర్దేశం చేసినట్లు నాయకులు తెలిపారు.