డిజిటల్ వివేకమే రక్షణ కవచం
తండ్రి నిరంతరం ఫోన్ చూస్తూ కుమారుడిని పుస్తకం చదవమంటే ఆ మాటకు బలం ఉండదు. తల్లి ప్రతి వ్యక్తిగత విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ కుమార్తెకు గోప్యత గురించి చెప్పినా అది ప్రభావవంతంగా ఉండదు. పిల్లలపై నిఘా కంటే వారితో సంభాషణ ముఖ్యం. ఫోన్ లాక్కోవడం కంటే వారు ఆన్‌లైన్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం.
ఒకప్పుడు మనిషి ప్రపంచాన్ని తెలుసుకోవడానికి వార్తాపత్రికను తెరిచేవాడు. ఇప్పుడు నిద్రలేచి కళ్లు పూర్తిగా తెరవకముందే సెల్‌ఫోన్ తెరిచి చూస్తున్నాడు. ఒకప్పుడు ఇంటి గుమ్మం దాటితే సమాజం కనిపించేది. ఇప్పుడు అరచేతిలోనే మొత్తం ప్రపంచం ప్రత్యక్షమవుతోంది. వార్తలు, వినోదం, విద్య, వ్యాపారం, రాజకీయాలు, ఉద్యమాలు, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ ఒకే తెరపై మన జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానం మనిషికి అందించిన అత్యంత శక్తివంతమైన సాధనాల్లో సోషల్ మీడియా ఒకటి. అయి తే ఆ శక్తిని మనం సరిగ్గానే ఉపయోగిస్తున్నామా? లేక ఆ శక్తే మన ఆలోచనలను, అభిరుచులను, భావోద్వేగాలను ఉపయోగించుకుంటోందా? ఈ చిన్న ప్రశ్నలోనే నేటి సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం దాగి ఉంది. సోషల్ మీడియా ఒక అద్దం మాత్రమే కాదు.
ఏ భావన్నైనా, భావననైనా కోటి రెట్లు పెంచే ఉత్ప్రేరకంలా పనిచేసే సాధనం కూడా. అద్దం మన ముఖాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. సోషల్ మీడియా మాత్రం మనలోని ప్రతి భావాన్నీ అనేక రెట్లు పెంచుతుంది. అందుకే సోషల్ మీడియా మంచిదా, చెడ్డదా అని ప్రశ్నించడం సరిపోదు. మన చేతిలో ఉన్న ఈ అపారమైన శక్తిని బాధ్యతతో ఉపయోగించేంత వివేకం మనకు ఉందా, లేదా అని ఎవరికివాళ్లు ప్రశ్నించుకోవాలి.
స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మాట్లాడుకునే పరికరమే కాదు. అది ఒక గ్రంథాలయం, తరగతి గది, వార్తా సంస్థ, మార్కెట్, బ్యాంక్, వినోద కేంద్రం, రాజకీయ వేదిక, అత్యవసర సహాయ కేంద్రం. ఒక మారుమూల గ్రామంలోని విద్యార్థి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయ ఉపన్యాసాన్ని వినగలుగుతున్నాడు. కళ ఉన్నా వేదికలేని గాయకు డు, రచయిత, చిత్రకారుడు తన ప్రతిభను ప్రపంచానికి చూపగలుగుతున్నాడు. ఒకప్పుడు ప్రజల సమస్య అధికారుల దృష్టికి వెళ్లాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
ఇప్పుడు ఒక ఫొటో, వీడియో, పోస్ట్ ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించగలుగుతోంది. సోషల్ మీడియా అనేక సందర్భాల్లో మానవత్వానికి వేదికగా నిలిచింది. కానీ ఇదే సోషల్ మీడియా ప్రపంచాన్ని దగ్గరకు తెచ్చే క్రమంలో మన పక్కనే ఉన్న మనిషిని మనకి చాలా దూరం చేస్తోందా? వైఫై సిగ్నల్ బలంగా ఉంది. కుటుంబ బం ధాల సిగ్నల్ మాత్రం బలహీనపడుతోంది. పరిచయాలు పెరుగుతున్నాయి. సంభాషణలు తగ్గుతున్నాయి. మనిషి చుట్టూ డిజిటల్ ప్రపంచం విస్తరిస్తున్న కొద్దీ అతని అంతరంగంలో ఒంటరితనం పెరగడం అత్యంత విచారకరమైన పరిణామం.
2018లో కేరళను భయంకరమైన వరదలు ముంచెత్తినప్పుడు సోషల్ మీడియా తనలోని అత్యున్నతమైన మానవీయ కోణాన్ని ప్రపంచానికి చూపించింది. రహదారులు నీటమునిగాయి. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. అనేక కుటుంబాలు ఇళ్ల పైకప్పులపై చిక్కుకున్నాయి. సాధారణ సమాచార వ్యవస్థలు పనిచేయని ప్రాంతాల్లో వాట్సాప్ సందేశాలు, ప్రత్యక్ష వీడియోలు, లొకేషన్ వివరాలు సహాయక బృందాలకు దారి చూపించాయి.
ఎక్కడ వృద్ధులు చిక్కుకున్నారు? ఏ ఇంట్లో చిన్నారులకు మందులు కావాలి? ఏ ప్రాంతానికి పడవ పంపాలి? ఎక్కడ ఆహారం అవసరం? ఇలాంటి సమాచారాన్ని వాలంటీర్లు పరిశీలించి అధికారు లు, రక్షణ బృందాలు, మత్స్యకారులకు చేరవేశారు. వినోదం కోసం ఉపయోగించే ఫోన్లు ఆ సమయంలో చిన్నచిన్న అత్యవసర నియంత్రణ కేంద్రాలుగా మారాయి. సాంకేతికత మనిషిలోని మానవత్వాన్ని నాశనం చేయదని, బాధ్యతతో ఉపయోగిస్తే ఆ మానవత్వానికి అసాధారణమైన వేగాన్ని అందిస్తుందని కేరళ వరదలు నిరూపించాయి.
కేరళలో ఒక సందేశం ప్రాణాలను కాపాడింది. కానీ దేశంలోని మరికొన్ని ప్రాంతా ల్లో తప్పుడు సందేశాలు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాయి. పిల్లలను అపహరిస్తున్నారంటూ పాత వీడియోలను కొత్త సంఘటనలుగా చూపిస్తూ వాట్సాప్‌లో ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని నిజమని నమ్మిన వాళ్లు అనుమానితులుగా భావించిన అమాయకులపై దాడులకు పాల్పడ్డారు.
ఇక్కడ బాధ్యత ఎవరిది? అబద్ధాన్ని మొదట సృష్టించిన వ్యక్తి మాత్రమే బాధ్యుడా? దానిని నిజమో, కాదో పరిశీలించకుండా పది మందికీ పంపిన వ్యక్తికి బాధ్యత లేదా? తనకు వచ్చినదే పంపానని చెప్పడం ద్వారా తనకు వచ్చిన అబద్ధాన్ని పదిమందికీ పంచిన వ్యక్తులు సామాజిక బాధ్యత నుంచి తప్పించుకోగలరా? సోషల్ మీడియాలో ఒక సమాచారాన్ని చూసినప్పుడు దాన్ని వెంటనే పంచుకోవడం తెలివితేటలకు ప్రతీక కాదు. దాని మూలాన్ని తెలుసుకోవడం, ఆధారాన్ని పరిశీలించడం, అది అబద్ధమైతే ఎవరికి నష్టం కలుగుతుందో ఆలోచించడం నిజమైన డిజిటల్ వివేకం. సోషల్ మీడియా అనే వేగవంతమైన వాహనానికి నిజనిర్ధారణే బ్రేక్.
సోషల్ మీడియాలో మనం ఇతరుల పూర్తి జీవితాన్ని చూడం. వారు ఎంపిక చేసి, అందంగా తీర్చిదిద్దిన కొన్ని క్షణాలను చూస్తాం. విజయం కనిపిస్తుంది. దానికి ముందు ఎదురైన పరాజయాలు కనిపించవు. అంటే మనం ఇతరుల జీవితంలోని అత్యుత్తమ దృశ్యాలను మన నిజ జీవితం తో పోల్చుకుంటున్నాం. అక్కడే అసంతృప్తి ప్రారంభమవుతోంది.
సైబర్ బులీయింగ్ సోషల్ మీడియా సృష్టించిన అత్యంత ప్రమాదకరమైన సమస్యల్లో ఒకటి. తరగతి గదిలో ఎవరినైనా అవమానిస్తే ఇంటికి వెళ్లిన తర్వాత బాధితుడికి కొంత ఉపశమనం దొరకవచ్చు. కానీ, సైబర్ వేధింపులు ఫోన్ రూపంలో ఇంటి వరకూ వెంట వస్తాయి. ఒక అవమానకరమైన కామెంట్, అనుమతి లేకుండా పంచిన ఫొటో, మార్ఫింగ్ చేసిన చిత్రం, హేళన చేసే వీడియో ఏ వ్యక్తినైనా చాలా కాలం మానసికంగా వేధించగలవు.
కాబట్టి ఎదురుగా మొహం మీద చెప్పలేని మాటను తెర వెనుక నుంచి రాసే హక్కు ఎవరికీ లేదు. ఆన్‌లైన్‌లో ఎవరైనా వేధింపులకు గురవుతున్నప్పుడు మౌనంగా చూడటం కూడా సమస్య లో భాగమే. బాధితుడికి అండగా నిలబడా లి. ఆధారాలను భద్రపరచాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్దలు, పిన్నలు, బాధ్యతగల అధికారులకు తెలియజేయాలి.
పిల్లలకు ఫోన్ ఇచ్చి, తరువాత ఫోన్ ఎం దుకు చూస్తున్నావని ప్రశ్నించడం మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత కాదు. పెద్దలు ముం దుగా తమ వినియోగాన్ని నియంత్రించుకోవాలి. తండ్రి నిరంతరం ఫోన్ చూస్తూ కుమారుడిని పుస్తకం చదవమంటే ఆ మాటకు బలం ఉండదు. తల్లి ప్రతి వ్యక్తిగత విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ కుమార్తెకు గోప్యత గురించి చెప్పినా అది ప్రభావవంతంగా ఉండదు. పిల్లలపై నిఘా కంటే వారితో సంభాషణ ముఖ్యం. ఫోన్ లాక్కోవడం కంటే వారు ఆన్‌లైన్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం. పిల్లలు పొరపాటు చేసినప్పుడు వారికి మొదట గుర్తుకొచ్చేది తల్లిదండ్రుల శిక్ష కాకూడదు. వారి సహాయం కావాలి.
సోషల్ మీడియా సమస్యలకు వినియోగదారులనే పూర్తిగా బాధ్యులను చేయడం సరైంది కాదు. ఏ కంటెంట్‌ను ఎక్కువ మంది కి చూపించాలో నిర్ణయించే అల్గోరిథమ్‌ల ను రూపొందిస్తున్న సంస్థలకూ బాధ్యత ఉంది. సంచలనాత్మకమైన, కోపాన్ని రెచ్చగొట్టే సమాచారం వేగంగా వ్యాపిస్తుందని తెలిసినా దాని ద్వారా వినియోగదారులను ఎక్కువసేపు యాప్‌లో ఉంచే వ్యాపార నమూనాలను ప్రశ్నించాలి. హానికరమైన తప్పుడు సమాచారం, సమన్వయంతో జరిగే వేధింపులు, పిల్లలపై దుష్ర్పభావం చూపే కంటెంట్ విషయంలో సామాజిక సేవా సంస్థలు వేగం గా స్పందించాలి. వినియోగదారుల గోప్యతను కాపాడాలి. డేటాను ఎలా సేకరిస్తున్నా యి, ఎలా ఉపయోగిస్తున్నాయి అనే విషయాల్లో పారదర్శకత పాటించాలి.
సోషల్ మీడియాను పూర్తిగా వదిలేయడం పరిష్కారం కాదు. సోషల్ మీడియాను బాధ్యతతో ఉపయోగించడం నేర్చుకోవాలి. ఏదైనా సంచలన సమాచారం కనిపించినప్పుడు వెంటనే స్పందించకూడదు. ఆవేశంలో కామెంట్ చేయకూడదు. నిజానిజాలు తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేయకూడదు. మరొకరి ఫొటో లేదా వ్యక్తిగత సమాచారాన్ని అనుమతి లేకుండా పంచకూడదు. ప్రతి పోస్టుకు ముందు మనం నాలుగు ప్రశ్నలు అడగాలి. ఇది నిజమేనా? ఇది అవసరమా? ఇది ఎవరికైనా నష్టం కలిగిస్తుందా? ఇదే మాటను ఆ వ్యక్తి ముఖం ఎదుట చెప్పగల నా? ఈ నాలుగు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితేనే పోస్టు చేయాలి.
భవిష్యత్తులో మన తరువాతి తరం మన ల్ని ఒక ప్రశ్న అడగవచ్చు. ప్రపంచంలోని ప్రతి మనిషితో మాట్లాడగల సాంకేతిక శక్తి మీ చేతిలో ఉన్నప్పుడు మీరు దానితో ఏం చేశారు? అప్పుడు మనం ఏమని సమాధానం చెప్పాలి? అబద్ధాలను పంచుకున్నామని చెప్పాలా? ఇతరులను అవమానించామని చెప్పాలా? లేక ఆ సాంకేతిక శక్తితో ప్రాణాలు కాపాడామని, జ్ఞానాన్ని పంచామని, అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తామని, అవసరంలో ఉన్న అపరిచితుడికి చేయి అందించామని, ద్వేషం కంటే మానవత్వాన్ని వేగంగా వ్యాపింపజేశామని గర్వంగా చెప్పగలమా? ఆ సమాధానాన్ని మనం మన భవిష్యత్తులో రాయట్లేదు.
ఈ రోజే రాస్తున్నాం. సోషల్ మీడియా ఒక మహాసముద్రం. అందులో జ్ఞానం అనే ముత్యాలు.. అవకాశాల అలలూ ఉన్నాయి. వదంతులనే సుడిగుండాలు, ద్వేషమనే విషజీవులు కూడా ఉన్నాయి. సముద్రాన్ని నిందించడం పరిష్కారం కాదు. ఈదడం నేర్చుకోవాలి. సరైన దిశను గుర్తించాలి. మునిగిపోతున్న వారికి చేయి అందించాలి. సాంకేతికతను ప్రేమిద్దాం. కానీ మానవత్వాన్ని మరిచిపోవద్దు. సోషల్ మీడియాను మన జీవితానికి వెలుగునిచ్చే దీపంగా మార్చుకుందాం. మన సమయాన్ని, మనశ్శాంతిని, మానవ సంబంధాలను దహించే శాపంగా మారకుండా చూసుకుందాం.
వ్యాసకర్త: జర్నలిస్ట్, మీడియా రీసెర్చర్
మల్లాది వేంకట గోపాలకృష్ణ






