2 September, 2026 | 2:23 AM

అశ్వాధ్యక్షుని బాధ్యతలు!

02-09-2026 | 12:26am

అశ్వాధ్యక్షః పణ్యాగారికం, 

క్రయోపాగతమ్,

ఆహవలబ్ధమ్, ఆజాతం, 

సాహాయ్యాగతకం,

పణస్థితం, యావత్కాలికం, 

వా అశ్వపర్యగ్రం,

కులవయోవర్ణచిహ్నకర్మవర్గాగమైః 

లేఖయేత్!

(కౌటిలీయం

అశ్వాధ్యక్షుని (అశ్వశాల అధ్యక్షుని) బాధ్యతలను చెపుతున్నారు ఆచార్య చాణక్య. రాజ్యానికి సంబంధించిన అశ్వసంపదను ఎలా నమోదు చేయాలి, నిర్వహించాలి, సంరక్షించాలి, నియంత్రించాలి అనే సమగ్ర పరిపాలనా వ్యవస్థ ఈ విభాగంలో కనిపిస్తుంది. పాలకులకు ఆస్తి నిర్వహణకన్నా విస్తతమైన “రాజ్య సామర్థ్య నిర్మాణమే” ప్రముఖమైనదనే భావనకు దర్పణంగా ఈ విభాగం కనిపిస్తుంది.

రాజులు గుర్రాలను పలువిధాలుగా సేకరిస్తారు. అందులో బహుమతులుగా వచ్చినవి, కొన్నవి, యుద్ధంలో జయించుకున్నవి, సహాయం కోసం ఇతరులు పంపినవి, తాకట్టు పెట్టబడినవి, కొంతకాలం కోసం అరువు తెచ్చుకున్నవి... ఇలాంటి గుర్రాలను కులం, వయస్సు, రంగు, గుర్తులు, అవి చేయగలిగిన పనులు, ఏయే వర్గాలకు సంబంధించినవి.. ఎలా లభించాయి.. అనే అన్ని విషయాలను వివరంగా పుస్తకంలో రాయించా లి. అలాగే సాధారణమైనవి, అంగవైకల్యం కలిగినవి, జబ్బుపడినవి, చికిత్సాదులు అవసరమైన వాటిని విడిగా తెలియచేయాలి.

ఇలా గుర్రాలను విభజించి నమోదు చేయడమనేది సంఖ్యగా “ఎన్నిగుర్రాలు ఉన్నాయి?” అనేది లెక్కించడానికి కాకుండా ప్రతి గుర్రం ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీద రాజ్యానికి ఉన్న హక్కు ఏమిటనే అంశాల ను కూడా నమోదు చేయించడంగా భావించాలి. ఇలా నమోదు చేసిన పుస్తకం ఈనాటి “అసెట్ రిజిస్టర్‌”లో కనిపించే ఆస్తి గుర్తింపు, వర్గీకరణ లాంటి కొన్ని ప్రాథమిక లక్షణాలకు ప్రతీకగా కనిపిస్తుంది. అలాగే ప్రతి గుర్రానికి కులం, వయస్సు, రంగు, గుర్తులు నమోదు చేయడం ద్వారా దానికొక వ్యక్తిగత గుర్తింపును కల్పించిన విధానం కనిపిస్తుంది. ఈనాడు కూడా పశువుల బ్రీడ్, వయసులాంటి వివరాలను నమోదు చేయ డం గమనిస్తాము.

ఈ ప్రక్రియను జాగ్రత్తగా గమనిస్తే చాణక్యుడు ముందుగా గుర్రాలను ఎలా సంరక్షించాలో చెప్పడం లేదు. వాటిని గుర్తించి, వర్గీకరించి, నమోదు చేయడం నుంచి ఆరంభించాడు. ఎందుకు? గుర్రాల ప్రయోజనం తెలిస్తేనే అవి ఆస్తియా లేక అప్పులా అనే విషయం అవగాహనకు వస్తుంది.

అలాగే గుర్రాలను “అవి చేయగలిగిన పనులను” బట్టి వర్గీకరించడం. గుర్రాలన్నీ అన్ని పనులకు ఉపకరించవు. కొన్నింటిని రథాలకు, కొన్నింటిని యుద్ధాలలో, కొన్నింటిని స్వారీచేయడానికి ఇలా వాటి సామర్థ్యాన్ని బట్టి వాడతారు. ఇలా గుర్రాలను కూడా పశుసంపదగా మాత్రమే కాకుండా నిర్దిష్ట సామర్థ్యం కలిగిన వనరులలో ఒకటిగా వాడడం ఆనాటి కాలంలో ఉండేదని భావించవచ్చు.

అశ్వసంరక్షకుడు గుర్రాలకు సంబంధించిన అన్ని విషయాలనూ చూచుకోవాలి. ఒక నెలకు సరిపడా ధనాన్ని ధనాగారం నుంచి, అశ్వాల ఆహారాన్నీ కోష్ఠాల నుంచి తీసుకోవాలి. నిజానికి ఇదొక ముఖ్యమైన పరిపాలనా సిద్ధాంతంగా కనిపిస్తుంది. అవసరమైన వనరులు ముందుగానే కేటాయించాలి.

ఇన్ని గుర్రాలు ఉన్నాయని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. వాటికి అవసరమైన ఆహారాన్ని, సంరక్షణను, వైద్య సదుపాయాలను, వసతిని, అవసరాలను దృష్టిలో పెట్టుకొని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవడం తద్వారా సైనిక వనరుల నిర్వహణకు ఆర్థిక వనరుల నిర్వహణను అనుసంధానం చేయాలని చాణక్య సూచనగా భావించవచ్చు. దీనివల్ల రక్షణ ఏర్పాట్లలో భాగంగా సైన్యం, దానికి అవసరమైన విభాగాలు, “ఖజానాల” మధ్య పరస్పర సంబంధాన్ని చాణక్యుడు ఎంత స్పష్టంగా చూశాడో తెలుస్తుంది.

గుర్రాలను కట్టివేసేందుకు ఒక అశ్వశాలను నిర్మింపచేయాలి. ఎన్ని గుర్రాలను అక్కడ ఉంచుతున్నామో దానిని బట్టి అశ్వశాల పొడుగును నిర్ణయించాలి. అలాగే ఒక పెద్ద గుర్రం పొడుగుకు రెట్టింపుగా అశ్వశాల వెడల్పు ఉండాలి. ఒక గుర్రం పొడుగును బట్టి చతురస్రంగా ఉండే స్థానాన్ని (గుర్రం ఆరు అడుగులు ఉంటే 6x4=24 చదరపు అడుగులు) దానికి కేటాయించాలి. ఆ అశ్వశాలలో గుర్రాలు యథేఛ్చగా పొరలడానికి చోటు కల్పించాలి. ఈ ప్రమాణాలు “ప్రతి జంతువుకు కనీస స్థలం కేటాయింపు” అనే సూత్రాన్ని గుర్తుచేస్తుంది.

ప్రధానద్వారం వద్ద కూర్చోడానికి బల్లలు ఏర్పాటుచేయడమే కాక పాములు మొదలైన వాటి నుంచి విషభయం లేకుండా అశ్వశాలలో కోతుల ను, నెమళ్లను, ముంగీసలను పెంచాలి. నిజానికిదొక ఆసక్తికరాంశమే కాని దీనితో విషజంతువుల నియంత్రణ సాధ్యమా అనేది విచారించాలి. అశ్వాల మూత్రపురీషాదులు ఒకే చోటికి చేరే విధంగా ప్రదేశాన్ని ఏర్పరచాలి. ఈ ఏర్పాట్లు మురుగు నియంత్రణ, పరిశుభ్రత, దుర్వాసన నియంత్రణ, వ్యాధుల నియంత్రణ, నిర్వహణ సౌలభ్యాన్ని సూచిస్తున్నాయి.

నిజానికిది “జంతువును ఉంచడం” మాత్రమే సరిపోదు “జంతువు నివసించే వ్యవస్థను రూపొందించడం” అనే భావనకు ప్రతీకగా నిలుస్తుంది. ఆడగుర్రాలు, మగ గుర్రాలను, పిల్ల గుర్రాలను ఒకదానికి మరొకటి కనిపించకుండా ఏకాంత స్థానాలు ఏర్పరచాలి, అంటున్నారు, చాణక్య. దీని వల్ల అశ్వాల మధ్య అనవసర కలయిక నివారించడం, వాటి ప్రవర్తనను నియంత్రించడం, పిల్ల గుర్రాల సంరక్షణ, నిర్వహణలో క్రమశిక్షణ వంటి అంశాలను చాణక్య పరిగణలోనికి తీసుకున్నట్లుగా భావించవచ్చు.

ఇలా పలు అంశాలను ఈ విభాగంలో వివరంగా తెలియచేశారు చాణక్య. దీనిని లోతుగా అవగాహన చేసుకుంటే అశ్వసంపద రాజునకు ఆస్తి మాత్రమే కాదు అది వ్యూహాత్మకమైన వనరులలో భాగంగా కనిపిస్తుంది. రాజ్యానికి చెందిన వ్యూహాత్మక వనరులను సేకరించడం, వాటిని గుర్తించడం, నిర్దిష్టంగా నమోదు చేయడం, వర్గీకరించడం, వాటి ఆరోగ్య పరిశీలన, నిర్వహణకు అవసరమైన వనరుల కేటాయింపు, ప్రశాంతమైన వసతి కల్పన, సంరక్షణ, వాటి సద్వినియోగమే కాకుండా దుర్వినియోగాన్ని నియంత్రించడం తద్వారా దాని సామర్థ్యాన్ని గరిష్ఠంగా ఉపయోగించుకోవడం లక్ష్యంగా చాణక్య ఆలోచించాడని భావించవచ్చు.

చివరగా... ప్రతి గుర్రాన్నీ నమోదు చేయడమనేది... “సమాచారం లేకుండా పరిపాలన జరగదనే” భావనను, వాటిని వర్గీకరించడమనేది “అన్ని ఆస్తులు సమానమైనవి కావనే భావనను”, వాటి ఆరోగ్యాన్ని బట్టి వేరుచేయడమనేది సంఖ్యకన్నా ఉపయోగించదగిన సామర్థ్యం ముఖ్యమనే భావనను, ఆహారాదులను సమకూర్చడం సైనిక శక్తికి పునాదులు నిర్మించడంగా భావించవచ్చు. అన్ని వనరుల సమగ్ర నిర్వహణయే సుపరిపాలన అనే భావనకు చాణక్యుని సూచనలు మూలాలుగా లేదా ప్రతీకలుగా చెప్పుకోవచ్చు.

మహాభారతంలో పాండవుల అజ్ఞాతవాస సమయంలో అశ్వవిద్యలో నిపుణుడైన నకులుడు తామగ్రంథి పేరుతో విరాటుని అశ్వశాలలో చేరి... గుర్రాల లక్షణాలను గుర్తించడం, వాటి సంరక్షణ, శిక్షణ వంటి విషయాల్లో తన నైపుణ్యాన్ని వినియోగిస్తాడు. పరిశీలిస్తే రాజ్యంలోని ప్రతి వనరునూ ప్రజోపయోగ రాజ్య వనరుగా గుర్తించి నిర్వహించడమనే భావన మహాభారతంలోనూ కనిపిస్తుంది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో కౌటిల్యుడు అశ్వాధ్యక్షునికి నిర్దేశించిన బాధ్యతలను పరిశీలిస్తే, అశ్వసంపదను ఒక వ్యవస్థగా నిర్వహించాలనే ఆలోచన మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

పాలకుర్తి రామమూర్తి