25 August, 2026 | 3:19 PM

కార్తీక్ వీడ్కోలు

02-06-2024 12:28 AM

చెన్నై: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శనివారం 39వ పుట్టినరోజు జరుపుకున్న కార్తీక్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. రెండు దశాబ్దాల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన దినేశ్ కార్తీక్ 26 టెస్టుల్లో 1025 పరుగులు, 94 వన్డేల్లో 1752 పరుగులు, 60 టీ20ల్లో 686 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఒకే ఒక సెంచరీ చేసిన కార్తీక్ ఖాతాలో 17 అర్థశతకాలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా కార్తీక్ 172 డిస్మిసల్స్‌లో భాగస్వామి అయ్యాడు. తన రిటైర్మెంట్‌పై కార్తీక్ సామాజిక మాద్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. ‘టీమిండియాతో నా బంధం ముగిసింది. నా రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం. రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. ఇన్నాళ్లు నాకు సహకరించిన కోచ్‌లు, కెప్టెన్లు, సెలెక్టర్లు, సహాయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కార్తీక్ వెల్లడించాడు. 

ధోనీ కంటే ముందే..

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కార్తీక్ గంగూలీ, ద్రవిడ్, కుంబ్లే, ధోనీ, కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటికీ కార్తీక్‌కు ఎక్కువగా మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. ధోనీ హవాలో మరుగున పడిపోయిన కార్తీక్ రెండో వికెట్ కీపర్‌గానే ఎక్కువకాలం కొనసాగాడు. ధోనీ మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యాకా కార్తీక్ జట్టుకు పూర్తిగా దూరమవ్వాల్సి వచ్చింది. ధోనీ గైర్హాజరీలో అడపా దడపా అవకాశాలు వచ్చినప్పటికీ రాణించడంలో విఫలమయ్యాడు. కార్తీక్ కెరీర్‌లో చెప్పుకోదగినది ఏదైనా ఉందంటే అది 2018 నిదహాస్ ట్రోఫీ. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో జట్టు విజయానికి 34 పరుగులు అవసరమైన దశలో  కార్తీక్  8 బంతుల్లోనే అజేయంగా 29 పరుగులు చేసి ఒంటిచేత్తో భారత్‌కు ట్రోఫీని అందించాడు. మరుసటి ఏడాది ఐపీఎల్లో ఫినిషర్‌గా అదరగొట్టిన కార్తీక్ 2022 టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. అయితే  ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యంతో కార్తీక్ జట్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వీడ్కోలు పలికిన కార్తీక్ టీ20 ప్రపంచకప్‌లో కామెంటేటర్‌గా దర్శనమివ్వనున్నాడు.