25 August, 2026 | 2:40 PM

జర్మనీకి భారత్ షాక్

02-06-2024 12:30 AM

లండన్: ఎఫ్‌ఐహెచ్ ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టు ప్రపంచ చాంపియన్ జర్మనీకి షాక్ ఇచ్చింది. లండన్ వేదికగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 3 జర్మనీని చిత్తుగా ఓడించింది. టీమిండియా తరపున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (16వ నిమిషంలో), సుఖ్‌జీత్ సింగ్ (41 ని.లో), గుర్జాంత్ సింగ్ (44 ని.లో) గోల్స్ చేశారు. మ్యాచ్‌లో భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు.

తొలి క్వార్టర్‌లో జర్మనీ ఆటగాళ్లు భారత డిఫెన్స్‌ను చేధించి ఎదురుదాడికి దిగారు. పదే పదే గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినప్పటికి కీపర్ శ్రీజేష్ అడ్డుగోడలా నిలిచాడు. మ్యాచ్‌లో జర్మనీకి 12 పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా.. శ్రీజేష్ వాటిని సమర్థంగా అడ్డుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. లీగ్‌లో 13 మ్యాచ్‌ల్లో 24 పాయింట్లతో హర్మన్ సేన పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. 12 మ్యాచ్‌ల్లో 26 పాయింట్లతో నెదర్లాండ్స్ అగ్రస్థానంలో నిలవగా.. 14 మ్యాచ్‌ల్లో 26 పాయింట్లతో అర్జెంటీనా రెండో స్థానంలో ఉంది.