31 July, 2026 | 8:37 PM

ప‌ట్నంలో మ‌ట్టి రోడ్లు

31-07-2026 07:25 PM

పేరుకే జీహెచ్ఎంసీ పరిధి.. రూపురేఖ‌లు మార‌ని కాల‌నీలు

బోడుప్ప‌ల్ స‌ర్కిల్ లో అధ్వానంగా రోడ్లు

వానొస్తే చెరువుల‌ను త‌ల‌పిస్తున్న ర‌హ‌దారులు ఇక్క‌ట్లు ప‌డుతున్న స్థానికులు

మేడిప‌ల్లి,(విజయక్రాంతి): నగరాభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన జీహెచ్ఎంసీ పరిధిలోని పలు కాలనీలు ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేక త‌ల్ల‌డిల్లుతున్నాయి. అంత‌ర్జాతీయ‌ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లోనే కొన్ని ప్రాంతాల్లో మట్టి రోడ్లు దర్శనమిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసిన ప్రతిసారి ఈ రహదారులు చెరువులను తలపిస్తూ రాకపోకలకు ఆటంకంగా మారుతున్నాయి.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధి చెంగిచెర్ల ప్రాంతంలోని ద్వారకా నగర్ ఫేజ్-2లో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కాలనీలో ఇప్పటికీ పూర్తిస్థాయి సీసీ లేదా బీటీ రోడ్లు లేకపోవడంతో మట్టి రహదారుల మ‌ధ్య ప్ర‌జ‌లు జీవించాల్సి వ‌స్తోంది. పేరుకే జీహెచ్ ఎంసీలో ఉంటున్నాం త‌ప్ప మాకు మౌలిక‌వ‌స‌తులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న‌పాటి వర్షం కురిసినా రోడ్లన్నీ బురదమయంగా మారి పెద్ద పెద్ద గుంతల్లో నీరు నిలిచిపోతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే ప్రజలు, వృద్ధులు, మహిళలు ప్రతిరోజూ ప్రమాదకర పరిస్థితుల్లోనే ప్రయాణించాల్సి వస్తోందని కాల‌నీవాసులు చెబుతున్నారు. ఇంటి పన్నుల వ‌సూళ్ల మీద ఉన్న శ్ర‌ద్ధ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో ఎందుకు లేద‌ని అధికారుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. వెంటనే మట్టి రోడ్ల స్థానంలో నాణ్యమైన సీసీ రోడ్లు నిర్మించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు చొర‌వ తీసుకుని కాల‌నీలోని రోడ్ల‌ను పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.