భద్రతా విధుల్లో క్రమశిక్షణ, సమన్వయమే కీలకం
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
350 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
ఎస్పీ సునిత రెడ్డి
నాగర్ కర్నూల్, జూన్ 4 (విజయక్రాంతి): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలన కొరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కుమ్మెర పుంప్ హౌస్ కార్యక్రమ ఇంచార్జ్, వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి తెలిపారు.
బందోబస్తు విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. పర్యటనను దృష్టిలో ఉంచుకుని మొత్తం 350 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. బందోబస్తును 03 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. ఒక ఎస్పీ, అడిషనల్ ఎస్పీతో పాటు ముగ్గురు డిఎస్పీలు, ఏడుగురు సిఐలు, 23మంది ఎస్త్స్రలు, 57 మంది ఏఎస్త్స్రలు/హెడ్ కానిస్టేబుల్స్, 253 మంది కానిస్టేబుల్స్, మహిళా హోంగార్డులు విధుల్లో ఉన్నారని తెలిపారు.
వారితో పాటు స్పెషల్ పార్టీలు, రోప్ పార్టీలు, బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్, మఫ్టీ పార్టీలు మొత్తం భద్రతా విధుల్లో పాల్గొంటాయని తెలిపారు. డ్యూటీ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫోన్ వినియోగం, నిర్లక్ష్య ప్రవర్తన సహించబోమని ఎస్పీ హెచ్చరించారు. తమకు కేటాయించిన పాయింట్ల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, పరిస్థితులను వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. భద్రతా విధుల్లో క్రమశిక్షణ, సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి డిఎస్పీ వెంకటరెడ్డి, సీఐలు, ఎస్త్స్రలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






