జిల్లాలో పరిశుభ్రత, అభివృద్ధి, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్ , జూన్ 4 (విజయ క్రాంతి): జిల్లాలో పట్టణ పరిశుభ్రత, అభివృద్ధి పనులు, అక్రమ ఇసుకమట్టి రవాణా నియంత్రణ, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్ నుంచి రాజ్ టాకీస్ చౌరస్తా వరకు మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించిన కలెక్టర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మురుగు కాలువలను ప్రతిరోజూ శుభ్రపరచడంతో పాటు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు.
రోడ్డుపై మురుగు నీరు, వినియోగించిన ప్లేట్లు పడవేసిన గురుకృప టిఫిన్ సెంటర్ యజమానికి జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతిని ఆదేశించారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు రోడ్లపై వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. అక్రమంగా ఇసుక, మట్టి రవాణా చేపడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కాగజ్నగర్ మండలంలోని గన్నారం మాండవ, ఆరెగూడ, అనుకొడ గ్రామాల పరిధిలో చెరువులను పరిశీలించిన సందర్భంగా నజ్రుల్ నగర్ విలేజ్ నెం.12లో మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను తనిఖీ చేశారు. సంబంధిత పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మట్టి, ఇసుక రవాణాకు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి బీఎల్‌ఓ యాప్లో నమోదు చేయాలని సూచించారు. సిర్పూర్ నియోజకవర్గంలో 320, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 358 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటి హేతుబద్ధీకరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు.
ఇటీవల బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం. రమేష్ జిల్లా కలెక్టర్ కె. హరితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా పరిధిలోని బొగ్గు ఉత్పత్తి, కొత్త గనుల విస్తరణ, భవిష్యత్ మైనింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. కొత్త గనుల ప్రారంభానికి అవసరమైన ప్రభుత్వ అనుమతుల విషయంలో జిల్లా యంత్రాంగం సహకారం అందించాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.






