5 June, 2026 | 3:23 AM

ప్రజల సంక్షేమాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

05-06-2026 01:26 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, జూన్ 4 (విజయక్రాంతి) : ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రభుత్వం చేపట్టిన గ్రామ/డివిజన్/వార్డు సభలలో భాగంగా గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం రాపల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామసభకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాయి వెంకట్ రెడ్డి, మండల విద్యాధికారి తిరుపతి, సర్పంచ్ రామ్ రెడ్డి లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో ప్రత్యేక సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామని,

ఈ సారి వర్షం తక్కువగా ఉన్నందున తదనుగుణంగా సాగు చేయగల పంటలను రైతులు ఎంపిక చేసుకోవాలని, ఆ దిశగా వ్యవసాయ, విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. యూరియా పంపిణీకి సంబంధించి యాప్ లో నమోదు చేసిన రైతులు, పంట, సాగు వివరాలకు అనుగుణంగా విడతల వారీగా యూరియా అందించడం జరుగుతుందన్నారు. భూమి రకాన్ని బట్టి దాదాపు పత్తి పంట ఎకరానికి 14 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, రైతులకు మద్దతు ధర అందించడం జరుగుతుందని తెలిపారు.

చిన్న, సన్న కారు రైతులు ప్రత్యామ్నాయంగా కూరగాయల పంటల సాగుపై దృష్టి సారించాలని, పంట సాగుకు ప్రభుత్వం రాయితీ అందిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధి పొందాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల తహసీల్దార్ల దృష్టికి తీసుకురావచ్చని, టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేస్తుందని తెలిపారు.