22 April, 2026 | 9:36 PM

ప్రజా ప్రభుత్వం వచ్చేనాటికి పాఠశాలలో ఎన్నో సమస్యలు

18-12-2024 04:14 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ నాలుగో రోజు కొనసాగుతుంది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై లఘు చర్చను పంచాయితీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమానికి క్యాబినెట్ మంత్రి సీతక్క ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలను ఈ ప్రభుత్వం 50 శాతం పెంచిందని సభ ముఖంగా గుర్తు చేశారు. గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాలను అధికారులు, ప్రజాప్రతినిధులు తరచూ భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేస్తున్నారని మంత్రి చెప్పారు. విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నాయని, పాఠశాలలను బాగు చేసేందుకే అమ్మ ఆదర్శ పాఠశాలల పథకాన్ని చెప్పట్టామన్నారు. పాఠశాలల పునర్నిర్మాణ బాధ్యతను మహిళ సంఘాలకు అప్పగించామని, టీచర్లకు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులు కల్పించినట్లు గుర్తు చేశారు. హిందీ పండిట్ లకు 18 ఏళ్లుగా ప్రమోషన్లు లేవని వ్యాఖ్యానించారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ కల్పిస్తూ జీవో జారీ చేసి, విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను కూడా మహిళా సంఘాలకు అప్పగించి, యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలు పెంచి మహిళలకు లబ్ధి చేకూర్చినట్లు స్పష్టం చేశారు.