దేవాలయ భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
ఎలాంటి పనులు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటాం
నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ జె. శ్రీనివాస్
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం పెద్దకాపర్తి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 201లో ఉన్న శ్రీ తిరుమల స్వామి దేవాలయానికి చెందిన సుమారు 102 ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయనే ఫిర్యాదులపై జిల్లా జాయింట్ కలెక్టర్ జె. శ్రీనివాస్ బుధవారం ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా ఈ భూములలో ప్రైవేట్ వెంచర్‌కు అనుకూలంగా సుమారు 100 ఫీట్ల వెడల్పుతో తారు రోడ్డు నిర్మాణం జరుగుతోందని, గుట్ట చుట్టూ నాలుగు వైపులా భూములు ఆక్రమించబడుతున్నాయని గ్రామస్తులు పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు.
ఇప్పటికే 2025 నవంబర్ 24న పూర్తి స్థాయి సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించినప్పటికీ కంచె ఏర్పాటు చేయడంలో జాప్యం కారణంగా ఆక్రమణలు కొనసాగుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అనుమతులు లేకుండానే రోడ్డు నిర్మాణం జరుగుతోందని ఆరోపించారు. పనులు తక్షణమే నిలిపివేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్థలాన్ని పరిశీలించిన అనంతరం జాయింట్ కలెక్టర్ జె. శ్రీనివాస్ గ్రామస్తుల అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుట్ట చివర భాగంలో రైతులు నడిచేందుకు గుంతలు, వంపులు పూడ్చుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
రైతుల పేరుతో భారీ యంత్రాలతో ఎలాంటి పనులు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తారు రోడ్లు లేదా సీసీ రోడ్లు నిర్మాణం చేపడితే యంత్రాలను స్వాధీనం చేసుకుని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యేంతవరకు అన్ని నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి ప్రైవేట్ వెంచర్లకు అనుమతులు ఇవ్వవద్దని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ కాటం వెంకటేషం, పొట్లపల్లి చిన్నస్వామి, చేకూరి గణేష్, నీలకంఠం లింగస్వామి, పున్న విష్ణు, పొట్లపల్లి సుభాష్, తెలుసూరి నరసింహ, పొట్లపల్లి మురళి, ఆవుల రాము, నీలకంఠ నరేష్, మర్రి హరీష్, ఏర్పుల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.






