13 March, 2026 | 7:28 PM

క్షమాపణలు చెప్పాకే ప్రాజెక్టులపై మాట్లాడాలి

22-12-2025 01:54 AM

పాలమూరు, నల్లగొండ జిల్లాలను మోసం చేసిందే కేసీఆర్

కమీషన్లకు కక్కుర్తిపడే ప్రాణహిత--చేవెళ్లను పక్కన పెట్టారు

ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండలోనే ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తాం-: మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : పాలమూరు, నల్లగొండ జిల్లాలకు మోసం చేసిందే కేసీఆర్ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ముందు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి ఇరిగేషన్ గురించి మాట్లాడాలని సూచించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఇరిగేషన్ విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు. అందరినీ తాకట్టుపెట్టి లక్ష కోట్ల అప్పు తెచ్చి వడ్డీ భారం మోపారన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు తెచ్చారని ఆరోపించారు.

తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గుండెకాయ అని చెబుతుంటారని.. కానీ, ఆ బ్యారేజీ కూలిపోయిందని.. ఆ బ్యారేజీ కూలిపోవడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని సుప్రీంకోర్టు జడ్జి రిపోర్టు ఇచ్చారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అయినా ఇరిగేషన్ మీద ఎలా మాట్లాడుతున్నారో వారికే తెలియాలన్నారు. కమీషన్ల కక్కుర్తి, అవగాహన లేక.. అమర్థతత, చాతగానితనం, లేదంటే దద్దమ్మలై రూ.1,81,000 కోట్లు ఖర్చు పెట్టి.. ఈ రాష్ట్రానికి, రైతులకు చేసిన ప్రయోజనం శూన్యమన్నారు.

ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా కేసీఆరే వ్యవహరించారని.. ఇరిగేషన్ను సర్వనాశనం చేసిందే కేసీఆర్ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ రుద్రమ కోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను కొనసాగించకుండా సీతారాంసాగర్‌ను తీసుకొ చ్చార ని.. ఆ రెండు స్కీములను కొనసాగిస్తే రూ.1,555 కోట్లతోనే 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చేదన్నారు. ఏళ్లుగా దేవాదుల ప్రోగ్రెస్‌లో ఉన్నా.. పదేళ్ల అధికారం లో దానిని పూర్తిచేయలేకపోయారన్నారు. 

పాలమూరు అబద్ధాలు 

పాలమూరు--రంగారెడ్డి విషయంలో కేసీఆర్ అబద్ధాలు చెప్పడం తగదని అన్నారు. పాలమూరు--రంగారెడ్డి మీద రూ.27 వేల కోట్లు,  సీతారామసాగర్‌కు రూ.8,500 కో ట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం ఆయకట్టు కూ డా ఇవ్వలేదన్నారు. లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయిందన్నారు. ఇదీ ఇరిగేషన్‌లో బీఆర్‌ఎస్ సాధించిన స్టోరీ అని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు--రంగారెడ్డికి 90 టీఎంసీలకు జీవో ఇచ్చారని.. ఆ తరువాత జూరాలకు సైతం జీవో ఇచ్చారని చెప్పారు.

తాము 45 టీఎంసీలు తగ్గించి కేంద్రానికి రాశామని చెప్పడం అబద్ధమన్నారు. మొదటి విడతలో మైనర్ ఇరిగేషన్ 45 టీఎంసీలకు సేవింగ్స్ ఇవ్వాలని.. మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ కోసం లేఖ రాసిన విషయాన్ని వెల్లడించారు. ఏనాడూ 90 టీఎంసీల కంటే తక్కువగా పాలమూరుకు తాము అడగలేదన్నారు. వాళ్ల హయాంలోనే రివైజ్డ్ ఎస్టిమేషన్ కింద పాలమూరు--రంగారెడ్డికి రూ.55వేల కోట్లు అవుతాయని అంచనా వేయగా.. రూ.27వేల కోట్లు ఖర్చు పెట్టారని.. ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరివ్వలేదని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక పాలమూరు--రంగారెడ్డి మీద రూ.7వేల కోట్లు ఖర్చు పెట్టామని.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మిగితా ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ లాగా మోసం చేసే అలవాటు తమకు లేదన్నారు. వీళ్లు ముట్టుకోని నార్లాపూర్, ఏదుల లింక్ కెనాల్ పనులను మూడు నెలల్లోనే పూర్తిచేయబోతున్నామని వెల్లడించారు. కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలన్నింటినీ నిర్మింస్తామని ట్రిబ్యునల్లో మీకన్న సమర్థవంతంగా కృష్ణా జలాలపై కొట్లాడుతున్నాం అన్నారు.

ఎవరు దద్దమ్మలోప్రజలే నిర్ణయిస్తారు

రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత--చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు క్యాన్సిల్ చేశారని.. ఎవరు దద్దమ్మలో ప్రజలే నిర్ణయిస్తార ని ఉత్తమ్ ఆగ్రహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్షకోట్లు వృథాచేయకుండా రూ.38 వేల కోట్లతో ప్రాణహిత పూర్తిచేసుంటే రూ.62వేల కోట్లు మిగిలేవన్నారు. మిగిలిన డబ్బులతో పాలమూరు --రంగారెడ్డి, కోయిలసాగర్, నెట్టెం పాడు, బీమా, ఎస్‌ఎల్బీసీ, డిండి, దేవాదుల ఇతర లిఫ్ట్ స్కీములు పూర్తయ్యేవ న్నారు. ప్రజలు కేసీఆర్ మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు. కేసీఆర్ ఉద్యమిస్తా, సభలు పెడుతానంటే జనం ఛీ కొడుతారని హెచ్చరించారు.

జగన్, కేసీఆర్ కుమ్మక్కుతో రాష్ట్రానికి ద్రోహం

2014 కంటే ముందు కేసీఆర్ సీఎం కాకముందు కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఏపీ రోజుకు 47వేల క్యూసెక్కులు  తరలించుకుపోతే.. కేసీఆర్ హయాంలో 1,11,400 క్యూసెక్కులకు పెరిగిందని మంత్రి ఆరోపించారు. జగన్, కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేశారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు కేసీఆర్ దోహదపడ్డారని.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను ఆపించామని చెప్పారు. శ్రీశైలం బాటమ్ నుంచి రోజూ 3 టీఎంసీలను తరలించుకుపోయే ప్లాన్ జగన్ చేశారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 2004--2014  వరకు 727 టీఎంసీల నీటిని అక్రమంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించుకుపోతే.. కేసీఆర్ పదేళ్ల కాలంలో 1,442 టీఎంసీలు ఏపీ తరలించుకుపోయిందన్నారు.