calender_icon.png 22 December, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కాడా.. లోపాలు కోకొల్లలు!

22-12-2025 01:57:30 AM

కాలం చెల్లిన సాంకేతికతతో సమస్యలు

పరికరాల కమ్యూనికేషన్ కేబుల్, బ్యాటరీ కనెక్షన్, సిమ్‌కార్డ్‌లలో ఎక్కువగా.. 

పనితీరుపై క్షేత్రస్థాయిలో పెదవి విరుపు 

కొన్ని చోట్ల పరికరాలను అప్పుడే మూలకు పడేస్తున్న సిబ్బంది సరిచేయడానికి 20 నుంచి 30 రోజుల సమయం 

ముందుగానే చెప్పిన ‘విజయక్రాంతి

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి) : విద్యుత్ సరఫరా, పంపిణీలో సబ్ స్టేషన్ల వారీగా, బ్రేకర్ల వారీగా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా.. క్షణాల్లో దానిని గుర్తించి పరిష్కరించడం తో పాటు దీనికి సంబంధించిన సమాచారాన్ని (డాటా) పొందుపర్చడం, విశ్లేషిం చడం లాంటివి చేసేందుకు వీలుగా స్కాడా (సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజిషన్ సిస్టం) ఏర్పాటు పను ల్లో  క్షేత్రస్థాయిలో సమస్యలు గోలపెడుతున్నాయి.

అత్యాధునిక సాంకేతికతను వాడాల్సినచోట.. పాతకాలం నాటి సాంకేతికతను వాడుతుండటంతో.. లోపాలు బయటపడుతున్నాయి. దీనితో అసలు వ్యవస్థనే పనికిరాకుండా పోతుందనే వాదనలు బంలగా వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని  నవంబర్ 2న  ‘విజయక్రాంతి’ దినపత్రిక  ‘ఉత్తర డిస్కంలో స్కాం.. 100 కోట్ల అక్రమ వడ్డింపులు’ శిర్షీకతో ప్రచురించిన కథనంలో చెప్పినట్టుగానే క్షేత్ర స్థాయిలో స్కాడా వ్యవస్థ ఏర్పాటులో లోపాలు బహిర్గతమవుతున్నాయి.

అనుమానిస్తున్నట్లుగానే.

రూ. కోట్లు ఖర్చుచేసి.. చేపట్టిన స్కాడా   ఏర్పాటు పనులపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ స్టేషన్లలో ఈ వ్యవస్థ విజయవంతం అవుతుందా అనే అనుమానాలు  ఉన్నాయి. ఎందుకంటే జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ అనేది ఒక రింగ్ లాగా ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అలా లేదు. అసలు గ్రామీణ ప్రాంతాల్లో స్కాడా వ్యవస్థ అవసరం లేదని ఇంజనీరింగు నిపుణులు చెబుతూనే ఉన్నారు.

వీటన్నింటినీ ‘మామూలు’గా తీసుకున్న ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్) కొందరికి లాభం కలిగించేందుకే స్కాడాను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. అనుమానిస్తున్నట్టుగానే క్షేత్రస్థాయిలో స్కాడా అనుకున్నంత స్థాయిలో పనిచేయడం లేదని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజా మాబాద్ జిల్లాల్లోని మారుమూల గ్రామీణ విద్యుత్తు సబ్ స్టేషన్లు కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న ఈ స్కాడా పనులు సరైన ఫలితాలను ఇవ్వడం లేదని, సూటిగా చెప్పాలంటే.. అసలు అవసరం లేదని క్షేత్రస్థాయిలో సిబ్బంది చెబుతున్నారు.  

సమస్యలు ఎక్కడెక్కడంటే..

ఇప్పుడు ఏర్పాటు చేసిన స్కాడా వ్యవస్థలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, అంతర్జా తీయంగా 61,850 అనే ప్రోటోకాల్ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను వాడకుండా.. పాతకాలానికి సంబంధించిన ఐఈసీ 104 ప్రోటోకాల్‌తో కూడిన ఐఈడీ (ఇంటిలిజెంట్ ఎలక్ట్రానిక్ డివైజ్)తో ఏర్పాటు చేయ డంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నట్టు సమాచారం. పైగా కమ్యూనికేషన్ కేబుల్, అలాగే బ్యాటరీ కేబుల్‌తోపాటు సిమ్ పెట్టే స్లాట్‌లోనూ కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది.

కేబుళ్లు త్వరగా వదులు అవుతున్నాయని ఫిర్యాదులున్నాయి. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమ స్యలను వరంగల్ హెడ్‌క్వార్టర్‌లో గుర్తించి దానిని సరిచేసేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్న సంస్థ నుంచి టెక్నీషియన్లు వచ్చి.. సరిచేయడానికి 20 నుంచి 30 రోజుల సమయం పడుతుందని చెప్పినట్లు క్షేత్రస్థాయిలో సిబ్బంది లబోదిబోమంటున్నట్టు తెలుస్తుంది.

అసలు గ్రామీణ ప్రాంతాల్లో అసవరమే లేని స్కాడాను ఏర్పాటు చేయ డం ఒకతప్పు అయితే.. అందులోనూ పాతకాలం నాటి సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం మరో తప్పంటూ.. నిపుణులు చెప్పిన అంశాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో అనుభవంలోకి వస్తున్నాయని అంటున్నారు. 

కొన్ని సబ్ స్టేషన్లలో పరికరాలు మూలకు..?

ఇదిలా ఉండగా.. సరిగా పనిచేయని పరికరాలు, అవసరంలేని స్కాడా వ్యవస్థలపై క్షేత్రస్థాయి సిబ్బందిలోనూ విముఖత వ్యక్తమవుతోంది. దీనితో మారుమూల ప్రాంతా ల్లోని కొన్ని సబ్ స్టేషన్లలో ఈ పరికరాలను మూలకు పడేస్తున్నట్టు సమాచారం. బిగించిన వ్యవస్థల్లోనూ లోపాలు తలెత్తడం, వాటిపై కార్పొరేట్ కార్యాలయం నుంచి అడుగుతుండటంతో.. అసలు పనికన్నా.. ఈ కమ్యూనికేషన్ పనే ఎక్కువగా ఉంటుందని పలువురు సబ్‌స్టేషన్ల సిబ్బంది చెబుతున్నారు.

మొదట్లో 100 సబ్ స్టేషన్లకు సంబంధించిన పనులు చేసిన సదరు కాంట్రాక్ట్ సంస్థ.. ఆపై వచ్చిన మరో 600 సబ్‌స్టేషన్లకు సంబంధించిన పరికరాలు, కేబుళ్లు, ప్యానెళ్లను స్టోర్‌కు తరలించి డంప్ చేశారు. దీనితో ఈ పరికరాల బిగింపులో కొంత నిర్లక్ష్యంగా కాంట్రాక్ట్ సంస్థ సిబ్బంది వ్యవహరిస్తున్నారని, దీనికితోడు సాంకేతికంగా అంత సమర్థవంతంగా పనిచేయ కపోవడం, కమ్యూనికేషన్, బ్యాటరీ కేబుళ్ల లాంటివి త్వరగా వదులు అవుతుండటంతో ఈ స్కాడా వ్యవస్థపై క్షేత్రస్థాయిలో పెదవి విరుస్తున్నారు.