ఈసీఐఎల్ అప్పీలు కొట్టివేత
గరిష్ఠ పరిమితి గ్రాట్యుటీ చెల్లించాలి
హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): సవరించిన గ్రాట్యుటీ నిబంధనల ప్రకారం గరిష్ఠ గ్రాట్యుటీ చెల్లించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) దాఖలు చేసిన అప్పీల్‌ను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. 2007 నుంచి 2010 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గరిష్ఠ పరిమితి కింద గ్రాట్యుటీ చెల్లించా ల్సిందేనంటూ స్పష్టంచేసింది. 2007 నుంచి 2010 మధ్య వందల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా, వారికి గ్రాట్యుటీ సీలింగ్ పరిమితి రూ.3.5 లక్షల కింద కాకుండా రూ.10 లక్షలుగా చెల్లించాలంటూ అప్పీలెట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈసీఐఎల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారించిన సింగిల్ జడ్జి అప్పీలెట్ అథారిటీ ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు వెలువరించారు. సింగిల్ జడ్జి తీర్పుపై ఈసీఐఎల్ దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈసీఐఎల్ తరఫు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ గ్రాట్యుటీ చట్టాన్ని 2010లో కేంద్రం గ్రాట్యుటీ సీలింగ్ రూ.3.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందన్నారు. ఈ పెంపు 2010 మే 24 నుంచి అమల్లోకి వస్తుందంటూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఇక్కడ ఉద్యోగులు 2010కి ముందే పదవీ విరమణ చేశారని, అందువల్ల ఆ పెంపు వర్తించదన్నారు.
ఉద్యోగుల తరఫు న్యాయవాది పీవీ కష్ణయ్య వాదనలు వినిపిస్తూ 2007 జనవరి 1 నుంచి రూ.3.5 నుంచి రూ.10 లక్షలకు పెంచాలని బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానం చేశారని అన్నారు. 2008 నవంబరు 26న ఆఫీసు మెమోరాండం ప్రకారం ఉద్యోగుల గరిష్ఠ పరిమితి గ్రాట్యుటీకి అర్హులేనని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం పీఆర్‌ఎసీ సిఫారసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2008 నవంబరు 26న ఆఫీసు మెమోరాండం జారీ చేసిందని, దీని ప్రకారం ఉద్యోగులు గరిష్ఠ పరిమితికి అర్హులేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణాల్లేవంటూ అప్పీలును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.






