2 September, 2026 | 2:09 AM

అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్

02-09-2026 | 12:00am

క్రమబద్ధీకరణకు పోలీసుల చర్యలు

మహబూబాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలోని పలు జంక్షన్ల వద్ద ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్(Vehicle parking) చేస్తున్నారు. దీనితో రోడ్లపై ఇతర వాహనాల రాకపోకలకు, ప్రజలు నడవడానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నెహ్రూ సెంటర్, తొర్రూరు బస్టాండ్, కురవి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల(Two-wheelers)ను అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు.

దీనికి తోడు పట్టణంలో ప్రధాన రహదారుల వెంట తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, వాణిజ్య సముదాయాల(Commercial complexes) ఎదుట వ్యాపార విస్తరణ కార్యక్రమాలతో తరచుగా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతోంది. జిల్లా కేంద్రం అయినప్పటికీ పటిష్టమైన ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని విమర్శలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి.

వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడంతో పాటు, గతంలో ట్రాఫిక్ నియంత్రణ(Traffic control) కోసం చేపట్టిన అనేక కార్యక్రమాలను పూర్తిగా విస్మరించి, రాకపోకలను కూడా కొనసాగిస్తుండడంతో పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్(Shabarish) జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్లపై వాహన పార్కింగ్, ట్రాఫిక్ సిగ్నల్ల ఏర్పాటు, జంక్షన్ల(Junctions) వద్ద నిరంతరం ట్రాఫిక్ నియంత్రణ కోసం అవసరమైన చర్యలు చేపట్టడానికి శ్రీకారం చుట్టారు.

మహబూబాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతిరావు చేపట్టారు. జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాలను నోటిఫై చేశారు. బ్యాంకులు, షాపింగ్ కాంప్లెక్స్లలోని పార్కింగ్ స్థలాలలోనే కస్టమర్ల వాహనాలు పార్కింగ్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. పార్కింగ్ స్థలాల కోసం కేటాయించిన స్థలాల్లో షాపులు ఏర్పాటు చేసి కిరాయికి ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పార్కింగ్ స్థలాల్లో కాకుండా రోడ్లపై వాహనాలు నిలిపి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. పార్కింగ్ స్థలాలను వినియోగించని పలు బ్యాంకులు, షాపింగ్ మాల్స్కు నోటీసులు జారీ చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా వాహనాల పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని డి.ఎస్.పి హెచ్చరించారు. 

నిరంతరం ట్రాఫిక్ నియంత్రణపై నిఘా

మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో ఇకనుండి ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల నిఘా ఉంటుంది. ప్రధాన జంక్షన్ లతోపాటు, వాణిజ్య సముదాయాలు, బ్యాంకుల వద్ద రద్దీ నియంత్రణకు ప్రణాళిక రూపొందించాం. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్ కు ఇక అనుమతించం. నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాహనాలను పార్కు చేయాల్సి ఉంటుంది. పోలీసుల సూచనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతిష్టమైన చర్యలు చేపట్టాం. 

- తిరుపతిరావు, 

డి.ఎస్.పి మహబూబాబాద్