తుర్కయాంజాల్ సహకార కుర్చీ ఎవరిది?
- ఒకే పదవి.. ఐదుగురు ఆశావహులు..
- ఎమ్మెల్యే మల్రెడ్డి నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ
ఆదిభట్ల, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం బ్యాంకు చైర్మన్ పదవి(Turkayanjal Rythu Seva Cooperative Bank Chairmanship) పై ఇప్పుడు అధికార పార్టీ నేతలు దృష్టి సారించారు. చైర్మన్ పదవీ ఎవరికి దక్కుతుందని కాంగ్రెస్పార్టీ శ్రేణు ల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ కావడంతో చైర్మన్ పీఠంపై పలువురు సీనియర్ నాయకులు కన్నేశారు. ముఖ్యంగా మల్రెడ్డి యాదిరెడ్డి(Malreddy Yadireddy), సామ భీంరెడ్డి, కొంతం వెంకట్రెడ్డి, కోహెడ మాజీ సర్పంచ్ కందాళ రంగారెడ్డి, గండిచెరువు మాజీ సర్పంచ్ జక్క సంజీవరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
పోటీలో పలువురు సీనియర్ నేతలు.,.
మల్రెడ్డి యాదిరెడ్డి (తొర్రూర్) హయత్నగర్ మండల పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సొంత తమ్ముడైన ఈయన, కార్య కర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. సామ భీంరెడ్డి (రాగన్నగూడ) సుమారు 15 ఏళ్లుగా కాంగ్రెస్ను నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నాయకుడు. గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ సహా పలు పదవుల్లో పేర్లు పరిశీలనకు వచ్చినా దక్కకపోవడంతో, ఈసారి సీనియారిటీ ఆధారంగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
కొంతం వెంకట్రెడ్డి (బ్రాహ్మణపల్లి) నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ను వీడకుండా, మల్రెడ్డి రంగారెడ్డి గెలుపు కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు.కందాళ రంగారెడ్డి (కోహెడ)మాజీ సర్పంచ్గా పనిచేసిన అనుభవం, స్థానిక ప్రజలతో, పార్టీ శ్రేణులతో బలమైన అనుబంధం ఈయనకు అనుకూలించే అంశాలు.జక్క సంజీవరెడ్డి (గండిచెరువు) గండిచెరువు మాజీ సర్పంచ్గా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, ప్రజాదరణ ఉన్న నాయకుడిగా చైర్మన్ రేసులో నిలిచారు.
రైతుల మద్దత్తు ఎవరికో.....
కేవలం రాజకీయ పరిచయాలే కాకుండా, రైతుల(Farmers)కు నిరంతరం అందుబాటులో ఉంటూ సొసైటీని పారదర్శకంగా నడిపించే నాయకుడికే ప్రాధాన్యం ఇవ్వాలని స్థానిక రైతాంగం కోరుతోంది. సకాలంలో రుణాలు అందించడం, బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపించే పరిపాలనా సామర్థ్యం ఉన్నవారికే బాధ్యతలు అప్పగించాలనే చర్చ సాగుతోంది.
ఎమ్మెల్యే నిర్ణయమే కీలకం....
ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తెరవెనుక మంతనాలు జోరందుకున్నాయి. ఈ ఎంపికలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నిర్ణయమే ఆఖరిది కానుంది. చైర్మన్ పదవి ఒకరికే దక్కే అవకాశం ఉన్నందున, మిగతా ఆశావహులకు పార్టీ పరంగా ఎలాంటి ప్రాధాన్యం కల్పిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. పార్టీ సేవలు, సీనియారిటీ, స్థానిక సమీకరణాలను బేరీజు వేసి ఎమ్మెల్యే ఎవరి పేరు ప్రకటిస్తాడో వేచి చూడాల్సిందే.






