28 August, 2026 | 9:51 AM

ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

27-08-2026 10:14 PM

గంధమల్ల ముంపు బాధితులకు రూ.88.84 కోట్ల పరిహారం పంపిణీ

ఏడాదిలో రిజర్వాయర్ పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం గంధమల్ల రిజర్వాయర్ ముంపు బాధితులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి పాల్గొన్నారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న ముంపు బాధితులకు పరిహారం కింద 352 ఎకరాలకు సంబంధించి రూ.88.84 కోట్ల విలువైన చెక్కులను రైతులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గంధమల్ల రిజర్వాయర్ ముంపు బాధితులకు న్యాయం చేసేందుకు ఎకరాకు పరిహారాన్ని రూ.24.50 లక్షలకు పెంచినట్లు తెలిపారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ఏడాది కాలంలో గంధమల్ల రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో సుమారు రూ.100 కోట్లతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు పర్యాటక రంగంలో ఉపాధి, అవకాశాల్లో మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని వెల్లడించారు. గంధమల్ల రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ గంధమల్ల రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు. రిజర్వాయర్ పనులు ప్రారంభించక ముందే భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం అందించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీల, ఇరిగేషన్ ఎస్‌ఈ రవీందర్, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, గంధమల్ల రిజర్వాయర్ ముంపు బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.