16 April, 2026 | 9:39 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం

03-04-2025 12:04 AM

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, ఏప్రిల్ 2(విజయ క్రాంతి): రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని స్టేషన్ ఘనపూర్  ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ తో కలిసి ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకంపై విలేకరుల సమావేశాన్ని  నిర్వహించారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 30 (ఉగాది రోజున) ప్రారంభించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో మొత్తం 90 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారని, వాటి ద్వారా 2 కోట్ల 81 లక్షల 50 వేల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా, ప్రతి నిరుపేదకు కడుపునిండా నాణ్యమైన సన్న బియ్యం బువ్వను అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. అలాగే ఈ పథకం పక్కదారి పట్టకుండా, ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతి ఒక్క లబ్ధిదారులు ఈ సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని (335) రేషన్ దుకాణాల ద్వారా (1,61,264) అన్ని రేషన్ కార్డుల లబ్ధిదారులకు (3,151) మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అంతకుముందు ఘనపూర్ (స్టేషన్), జాఫర్గడ్, చిల్పూర్, రఘునాథపల్లి మండలాల వారీగా పలువురు లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని  కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ తో కలిసి ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఇంఛార్జి డీసీఎస్‌ఓ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, డీఎం సీఎస్ హతీరాం, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, సరస్వతి, శంకరయ్య, ఇతర సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, రేషన్ డీలర్లు, సిబ్బంది, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.