11 June, 2026 | 2:09 AM

100 మంది వాహనదారులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ

11-06-2026 01:38 AM

గద్వాల టౌన్ జూన్ 10: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గద్వాల సీఐ టి.శ్రీను సూచించారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గద్వాల మండలంలోని పూడూరు గ్రామంలో 100 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీఐ టి.శ్రీను, రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని,అది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా ప్రాణరక్షణ కవచమని అన్నారు.ప్రయాణ సమయంలో సెల్ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించి రహదారిపై పూర్తి అప్రమత్తతతో ఉండాలని సూచించారు.అలాగే నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో తీవ్ర గాయాలు, ప్రాణనష్టం నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు,గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.