17 April, 2026 | 4:12 AM

పదవీ ఉన్నా లేకున్నా.... నా జీవితము మునుగోడు ప్రజలకు అంకితం

05-06-2025 04:45 PM

పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు..

ఇందిరమ్మ ఇల్లుల మంజూరి పత్రాల పంపిణీ..

ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూసే బాధ్యత అధికారులపై ఉంది...

డిండి, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే మునుగోడు సస్యశ్యామలం అవుతుంది..

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం..

మునుగోడు (విజయక్రాంతి): పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు మంజూరు చేయించే బాధ్యత నాదని పదవి ఉన్న లేకున్నా నా జీవితం మునుగోడు ప్రజలకే అంకితం అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. గురువారం మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా మొదటి దశలో అర్హులైన నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లుల లబ్ధిదారులకు మునుగోడులోని క్యాంపు కార్యాలయం వద్ద అట్టహాసంగా పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇల్లుల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి చండూరు మున్సిపాలిటి, చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడెం, గట్టుప్పల్ మండలాలలో ఇందిరమ్మ ఇల్లులు మంజూరైన లబ్ధిదారులకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi), శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యంతో కలిసి ఇందిరమ్మ ఇల్లుల మంజూరి పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఇండ్లు మంజూరు అయిన ప్రతి ఒక్క లబ్దిదారునికి పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఇండ్లు రాని వాళ్ళు అధైర్య పడొద్దు అర్హులైన పేద వాళ్ళందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది అని అన్నారు.నియోజకవర్గంలో కనీసం పదివేల ఇండ్లు మంజూరి అవసరం ఉంది. ప్రస్తుతానికి 3500 మంజూరు అయ్యాయి అని అన్నారు. కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లులు  ప్రభుత్వం ఇస్తుంది. ఇల్లు రానివారు ఎట్టి పరిస్థితిలో అధైర్య పడొద్దు.

మొదటి విడతన అర్హులైన నిరుపేదలకు 3500 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, దక్కినవారందరికీ రెండవ విడతలో ఇల్లులు ఇస్తాము అని అన్నారు. ఇల్లు అనేది ఆత్మ గౌరవం, గత పది సంవత్సరాలలో ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇల్లు కట్టిన పాపాన పోలేదు. అర్హులు ఏ ఒక్కరు ఇందిరమ్మ ఇళ్లు లేకుండా ఉండరాదు, అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు ఇల్లు రాకూడదు, ఈ బాధ్యత అధికారులపై ఉంది. కొంత మంది నిరుపేదలు ఇదివరకే బేస్మెంట్ నిర్మించుకున్నారు, అలాంటి వారికి సైతం ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని జిల్లా కలెక్టర్ కు సూచన చేశారు.

ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకంగా ఉండాలి...

ప్రభుత్వం ఇంటి కోసం మంజూరు చేస్తున్న 5 లక్షల రూపాయలు సరిపోవని, ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నల్గొండ జిల్లాలోని అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నందున డిస్కౌంట్ పై సిమెంట్ ఇచ్చే విధంగా లబ్ధిదారులకు మేలు జరిగేలా చూస్తానని అన్నారు.నిరంతరం ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తాను నిరుపేద కుటుంబాల అందరికీ సొంతింటి కళ నెరవేరే వరకూ పోరాడుతా అని తెలిపారు.

ప్రభుత్వ పథకాలు అర్హులకే అందేలా చూసే బాధ్యత అధికారులపై ఉంది...

శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం..

అర్హులకే అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూసే బాధ్యత అధికారులపై ఉంది అని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం అన్నారు. సంవత్సరాల తరబడి పూరి గుడిసెలో నివసిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం సంతోషం అని తెలిపారు. నియోజకవర్గంలో సుమారు పది వేల మంది వరకు నిరుపేదలు ఉన్నారు, వారందరికీ ఇల్లు రావాల్సిన అవసరం ఉంది.మునుగోడు నియోజకవర్గం పూర్తిగా ఫ్లోరైడ్ ప్రాంతమని ,సుమారు 1500 ఫీట్లు బోరూ వేసినా నీరు పడని పరిస్థితి ఉందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా  డిండి,ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల సాగునీటి ప్రాజెక్టులు  పూర్తయితే మునుగోడు సస్యశ్యామలం అవుతుంది.

క్షేత్రస్థాయిలో మరోసారి పూర్తిగా పరిశీలించి అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు ఉన్నారు.