హుజురాబాద్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
హుజురాబాద్,(విజయక్రాంతి): హుజూరాబాద్ మండలం సిర్సపల్లి సమీపంలో జాతీయ రహదారి 563ని ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్ ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా గురువారం రాత్రి పరిశీలించారు. జాతీయ రహదారిని ఆనుకొని డంపింగ్ యార్డ్ ఉండడం పట్ల భారత జాతీయ రహదారుల ప్రాధికారత సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ స్థలాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రెవిన్యూ, మునిసిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.
జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న స్థలంలో కొంత దూరం వరకు చెత్త డంప్ చేయడం నిలిపివేయాలని అన్నారు. ఇదే స్థలంలో రహదారికి కొంత దూరం తర్వాత డంప్ చేయాలని సూచించారు. రహదారిని అనుకున్న స్థలంలో పచ్చదనం పెంపొందించాలని, మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. రహదారిని ఆనుకొని చెత్త వేయకుండా చూడాలని అన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీవో జల కుమారి, ఎన్. హెచ్. ఏ. ఐ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, తహసిల్దార్ నరేందర్ ఉన్నారు.






