8 May, 2026 | 5:48 PM

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

08-05-2026 04:41 PM

రైస్ మిల్లులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష 

సుల్తానాబాద్ , మే 08 (విజయ క్రాంతి): జిల్లాలో జరుగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు, శుక్రవారం జిల్లా కలెక్టర్ కల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం, కల్వశ్రీరాంపూర్ మండల కేంద్రం, ఓదెల మండలంలోని పోత్కపల్లి, ఓదెల మండల కేంద్రం, సుల్తానాబాద్ మండలంలోని రేగడి మధికుంట గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.

అలాగే సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని జై హనుమాన్ రైస్ మిల్, సాంబశివ రైస్ మిల్, పూసాల గ్రామంలోని కనకమహాలక్ష్మి రైస్ మిల్, సుగ్లంపల్లి గ్రామంలోని లక్ష్మీ భవాని రైస్ మిల్లులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన వాహనాలను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారునాణ్యమైన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడింగ్ చేసి ఆలస్యం లేకుండా కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ తెలిపారు.

రైస్ మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ట్రక్ షీట్లు వెంటనే జనరేట్ చేయాలని సూచించారు.రైస్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి కోతలు విధించకుండా ధాన్యం స్వీకరించాలని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన చెల్లింపులు వారి బ్యాంకు ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.ఈ తనిఖీలలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్,  సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.