1 April, 2026 | 10:43 PM

బెల్లంపల్లిలో ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ

01-04-2026 08:52 PM

- 11 మందికి షోకాజ్ నోటీసులకు ఆదేశాలు..

- వీధుల పై నిర్లక్యం సహించం

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సుడిగాలి పర్యటన చేశారు. విద్య, వైద్య రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. పాఠశాల అభివృద్ధి పనులు, తరగతి గదులు, మూత్రశాలలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలనన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్య బోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలనన్నారు. తరగతి గదిలో విద్యార్థులను పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అభ్యాసనసామర్ధ్యాలను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసిల్దార్ తో కలిసి రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు.

రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రక్రియ వేగవంతం చేసేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. వివిధ ధ్రువపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. కార్యాలయ హాజరు పట్టిక పరిశీలించి సమయపాలన పాటించని 11 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు, ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనన్నారు. అవసరమైన మందుల నిల్వ,అందుబాటులో ఉంచుకోవాలనిన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు విధుల పట్ల వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. సకాలంలో వైద్య సేవలు అందించాలని తెలిపారు.

అనంతరం మండలంలోని బట్వాన్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 15 రోజుల కార్యచరణలో భాగంగా వైద్య శిబిరాలు  పకడ్బందీగా చేపట్టాలన్నారు. శిబిరానికి వచ్చే ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను ఉచితంగా అందించాలని తెలిపారు. ఆయన వెంట  సంబంధిత శాఖల అధికారులు  ఉన్నారు.