30 May, 2026 | 9:45 PM

Breaking News

వరద సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించిన యూఎస్‌టీ సంస్థకు జిల్లా కలెక్టర్ ప్రశంస

30-05-2026 09:45 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో 2025 సంవత్సరంలో సంభవించిన వరదల సమయంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల కింద విశేష సేవలు అందించిన హైదరాబాద్‌కు చెందిన యూఎస్‌టీ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తన ఛాంబర్‌లో అభినందించారు. వరదల ప్రభావానికి గురైన కుటుంబాలకు యూఎస్‌టీ సంస్థ 600 డిజాస్టర్ ఫ్లడ్ రిలీఫ్ కిట్లను పంపిణీ చేసి సకాలంలో మానవతా సహాయాన్ని అందించిందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలకు అత్యవసర సహాయం అందిందని, సమాజ సేవ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలిచిందన్నారు. యూఎస్‌టీ సి ఎస్ ఆర్ అంబాసడర్ తిరుమల విజయ్ కుమార్‌తో పాటు వాలంటీర్ బృంద సభ్యులు రాధికా పెరుమాళ్, షాహుల్ సయ్యద్, సురేంద్రనాథ్ తిరునగరం, బిక్షపతి ఎండ్లా చేసిన సేవలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో సహాయక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచినందుకు వారికి ప్రశంసలు తెలిపారు.

జిల్లా ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా యూఎస్‌టీ సంస్థ ప్రతినిధులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూఎస్‌టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో విద్య, వైద్య రంగం, డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో భవిష్యత్తులో సి ఎస్  ఆర్ కార్యక్రమాలను విస్తరించే అవకాశాలపై చర్చించారు. జిల్లా అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాల్లో రాబోయే సంవత్సరాల్లో కూడా యూఎస్‌టీ సంస్థ తమ సహకారాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి దోహదపడే సి ఎస్ ఆర్ కార్యక్రమాలలో జిల్లా పరిపాలన యూఎస్‌టీ సంస్థతో భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.