ఎగువ మానేరు సందర్శించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ బుధవారం సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి గౌడ్, జిల్లా కార్యదర్శి గాండ్ల బాలలక్ష్మి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంగీతం శ్రీనివాస్, నర్మాల ఎగువ మానేరు జలాశయంలోకి సమృద్ధిగా నీరు చేరడం ఈ ప్రాంత రైతులకు శుభపరిణామమని తెలిపారు.
జలాశయంలో నిల్వయ్యే నీరు సాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా ప్రజలకు తాగునీటి భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు. నీటి వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు.రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, ప్రజలకు తాగునీటి భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.






