జైలు భరోను విజయవంతం చేయండి
బూర్గంపాడు,(విజయక్రాంతి): ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైలు భరో కార్యక్రమాన్ని కార్మికులు, రైతులు, విద్యార్థులు, ప్రజలు విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం బూర్గంపాడు మండల కేంద్రంలో ఐకేపీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను బలహీనపరిచిందని విమర్శించారు.
ఎనిమిది గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచే విధానాలతో కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిదినాలు తగ్గడం వల్ల గ్రామీణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఆరోపించారు.కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఐక్యంగా ఆగస్టు 10న జరిగే జైలు భరో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ దీపికలు సుజాత, నక్షత్రమ్మ, లక్ష్మి, ఉమ, నాగమణి, లక్ష్మీకాంత తదితరులు పాల్గొన్నారు.






