7 May, 2026 | 3:58 PM

వైవిధ్యమే జీవజాతులకు రక్ష

22-05-2024 12:00 AM

సుంకవల్లి సత్తిరాజు

మానవులంతా ఒక చెంత, వేరే జీవులంతా వేర్వేరు దారుల్లో. జీవుల పోరాటమంతా ఆహారం కోసమే. జీవుల జీవన గమ్యం ఒకటే జీవించే మార్గాలే భిన్నం. సమస్త సృష్టిలో ఇదే వైరుధ్యం. ఇదే జీవ వైవిధ్యం. ఇలాంటి జీవ వైవిధ్యం మానవ మనుగడను పది కాలాలపాటు భూగ్రహంపై కొనసాగేలా చేస్తుంది.

భూమి కోసం పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మనపై ఉంది. మొక్కలను నాట డం, పర్యావరణాన్ని రక్షించడం హానికరమైన వ్యర్థాలు భూమిపై లేకుండా చేయ డం వంటి అనేక చర్యల ద్వారా జీవరాశుల ఉనికిని కాపాడడం మన ముందున్న లక్ష్యం. 2010 నుండి ‘ఐక్యరాజ్యసమితి’ ప్రతీ ఏటా (మే 22) జీవ వైవిధ్య దినోత్స వం జరపాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రణాళికలో మనమూ భాగ స్వాములమవుదాం’ (బి పార్ట్ ఆఫ్ ది ప్లా న్) ఈ ఏడాది ఇతివృత్తంగా ప్రకటించారు. 

భవిష్యత్తు పరిణామాలు భయానకం

సమస్త సృష్టిలో జీవజాతుల మధ్య నెలకొన్న వైవిధ్యం ప్రకృతి కల్పించిన గొప్ప లక్షణం. ఒక జీవికి, మరొక జీవికి జీవించే విధానంలో, ఆహారపు అలవాట్లలో వైవిధ్యం ఉంది. మనుగడ కోసం సాగించే పోరాటంలో ఒక్కొక్క జీవి ఒక్కో విలక్షణమైన శైలిని కలిగి ఉంది. ప్రతీ జీవి, ఇతర జీవరాశులపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆధార పడక తప్పదు. అదే ప్రకృ తి విశిష్ఠత. అన్ని జీవరాశులు ప్రకృతిలో మమేకమై జీవించాలి. దురదృష్టవశాత్తూ మానవ మేధస్సు ఇతర జీవరాశులపై ఆధిక్యత ప్రదర్శించడం వల్ల ఎన్నో తమ అస్తిత్వం కోల్పోయాయి.

గతంలో ఈ భూమండలంపై జీవించిన పలు రకాల ప్రాణులు మానవ దుష్కృత్యాలతో అంతరించి పోయాయి. మరికొన్ని జీవరాశులు అంతర్ధానానికి దగ్గరలో ఉన్నాయి. పంటపొలాల్లో పలు రకాల జీవజాతులు  మనం వినియోగించే పురుగు మందులు, ఇతర రసాయనాల వల్ల నశించి పోతున్నాయి. కాలుష్య కారకాలవల్ల మనతో మమేకమై జీవించే అనేక ప్రాణులు అంతర్ధానమై పర్యావరణానికి శాపంగా మారుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూ ఉపరితలం వేడెక్కి పోవ డం, సముద్ర జలాలు కలుషితం కావడం వల్ల జరుగుతున్న పరిణామాలు భయంకరంగా ఉండబోతున్నాయి.

భూమి మన ఒక్కరి కోసమేనా?

ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని కొన్ని గణాంకాలు సూచిస్తు న్నాయి. జనాభా విస్ఫోటనం ప్రకృతిపైన, పర్యావరణంపైన పెను ప్రభావం చూపుతున్నది. జనావాసాల కోసం అడవులను నరికివేస్తున్నాం. రవాణా సౌకర్యాల నిమి త్తం  పచ్చని భూములు హరించుకు పోతున్నాయి. ఆకాశహర్మ్యాలు  వెలుస్తున్నాయి. అనునిత్యం భూమిపై దాడి కొనసాగుతున్నది. పర్యావరణ సమస్యలవల్ల వేలాది జంతువులు, వృక్షజాతులు అంతరిస్తున్న జాబితాలో ఉన్నాయి. ఎన్నో రకాల కీటకాలు, పక్షులు, మొక్కల్లో 40 శాతం పైగా అంతరించిపోయే దశలో ఉన్నాయి. జీవులన్నీ ప్రకృతిలో మనతోపాటు జీవించే అవకాశాన్ని మనమే లేకుండా చేస్తున్నాం.

జీవ వైవిధ్యం మానవాళి మనుగడకు అవసరం. జీవ సమతుల్యత లోపిస్తే జరగబో యే పరిణామాలు మానవ వినాశనానికి దోహదం చేస్తాయి. ప్రకృతి ఈ సమస్త సృష్టికి నిండైన అందాన్ని సమకూర్చి పెట్టింది. ఇలాంటి ప్రకృతిలో మానవులతోపాటు జంతువృక్ష జాలాలు, క్రిమి కీట కాలు, భౌతిక, రసాయనిక పదార్థాలు నిం డి ఉన్నాయి. అరణ్యాలు, నదీ నదాలు, పర్వతాలు, లోయలు వంటి ప్రకృతి వనరులు ఎన్నో. ఇవన్నీ కేవలం ఒక భూగ్రహానికే పరిమితం కావడం భూగ్రహ వాసు లుగా మనకు దక్కిన అరుదైన వరం.

ఎన్నో వింతలు, విచిత్రాలతో విభిన్న జీవరాశుల కలయికతో, వాటి మనుగడకు కావలసిన అనేకమైన సహజ వనరులతో అద్భుతంగా ఏర్పడిన ధరిత్రిని సజీవంగా ఉంచడానికి నిరంతర కృషి జరగాలి. ఇతర గ్రహాలను పరిశోధించడం, ఇతర గ్రహాల్లో జీవించడానికి అనువైన పరిస్థితుల కోసం అన్వేషించడం, సజీవమైన భూగ్రహాన్ని వదిలేసి, ఇతర గ్రహరాశులపై మక్కువ పెంచుకోవడం నేల విడిచి సాము చేయడమే. ఇతర గ్రహాలపై పరిశోధనలు చేయ డాన్ని తప్పు పట్టలేం. కానీ, నివాసయోగ్యమైన భూమిని కాలుష్యంతో నింపేసి, భూవాతావరణాన్ని నాశనం చేసి, కోట్లాది జీవరాశులను ప్రాణ సంకటంలోకి నెట్టడంలోగల ఔచిత్యమేమిటి? 

అవాంఛనీయ చర్యలను ఆపుదాం

జీవ వైవిధ్యం దెబ్బతినడంతో ప్రకృతిలో అనేక అవాంఛనీయ మార్పులు సంభవిస్తున్నాయి. మానవాళికి పలు రకాలుగా ఉపయోగపడే జీవసంపద మానవ స్వార్థ చింతనవల్ల నశించిపోయింది. ఒకవైపు ప్రకృతి విధ్వంసం వల్ల భూవాతావర ణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాలుష్య కారకాలు పెరిగిపోయా యి. పర్యావరణం దెబ్బతిన్నది. మనతో కలిసి జీవిస్తున్న జీవరాశులెన్నో ప్రకృతిలో చోటు చేసుకుంటున్న విపరీతమైన పోకడలకు నిలువలేక ఇప్పటికే అదృశ్యమైపో యాయి. ప్రకృతి విధ్వంసం వల్ల జీవ వైవిధ్యం లోపించింది. ఈ లోపమే హానికారకమైన వైరస్‌ల పుట్టుకకు మూల కార ణమవుతున్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్న వైరస్‌లు మున్ముందు మరింతగా విజృంభించవచ్చు. కరోనా మృత్యు కౌగిట్లో చిక్కుకుని కాటికి పోయిన మానవ శవాల గుట్టలు శాస్త్ర విజ్ఞానానికే సవాలు విసిరాయి. జీవ వైవిధ్యాన్ని హరించి, ప్రకృతితో చెలగాట మాడిన ఫలితమే సకల వైపరీత్యాలకు మూల కారణం. ప్రకృతిని నాశనం చేస్తు న్న మానవుని విధ్వంస కాండ అత్యంత ఆందోళనకరంగా ఉంది. కనుక, ప్రకృతిని పరిరక్షించి తద్వారా, జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. సకల జీవరాశుల ఉనికిని భూమం డలంపై సుస్థిరం చేయడానికి అంతర్జాతీయ సమాజం నడుం బిగించాలి. 

జలపాతాల హోరులో ప్రకృతి అందం పరిమళించాలి. చిగురుటాకులపై పడ్డ మంచు తుంపరలను వెలుతురు స్పర్శించి మిలమిలా మెరిసే ముత్యాల్లా భ్రమింపచేయాలి. చిరుగాలుల సవ్వడికి పంట పొలాల్లో పైర్లన్నీ అలవోకగా నర్తించాలి. చెట్ల కొమ్మల చాటునుండి వెలుగు రేఖలు చీల్చుకుని వస్తుంటే,  తెలియని అనుభూతులకు దారులు దగ్గరవుతున్న దృశ్యం కళ్ళ ముందు గోచరించాలి. పక్షులన్నీ గగన విహారం చేస్తూ, కిలకిల రావాలు  చేస్తుంటే, చేల గట్లన్నీ శ్రమ జీవుల పాదాల చప్పుళ్ళతో పులకరిస్తుంటే, పొలాలన్నీ కోత కొచ్చిన పైర్లతో నిండుదనం సంతరించుకుంటుంటే ధరణిపై వృక్షాలు ఫలాలతో  శోభించాలి.

జలచరాలు నీటి చెలమలను ఆశ్రయించి, ఆహారం కోసం పరితపిస్తుం టే, పశువులు గుంపు గుంపులుగా బయలుదేరి పచ్చిక బయళ్ళలో  మేస్తూ కడుపు నింపుకుంటుంటే, లేగ దూడల మెడలో కట్టిన మువ్వల శబ్దం పుడమికి శోభనిస్తూ ప్రతిధ్వనిస్తుంటే  ప్రకృతి అందాలు పరవశింప చేసే దృశ్యాలు అగుపించాలి. మాన వులంతా ఒక చెంత, వేరే జీవులంతా వేర్వేరు దారుల్లో. జీవుల పోరాటమంతా ఆహారం కోసమే. 

జీవుల జీవన గమ్యం ఒకటే జీవించే మార్గాలే భిన్నం. సమస్త సృష్టిలో ఇదే వైరుధ్యం. ఇదే జీవ వైవిధ్యం. ఇదే ప్రకృతిని కాపాడుతున్న విభిన్న జీవరాశుల వైవిధ్య భరిత జీవన వలయం. ఇలాంటి జీవ వైవిధ్యం మానవ మనుగడను పదికాలాలపాటు భూగ్రహంపై కొనసాగేలా చేస్తుంది.

వ్యాసకర్త సెల్: 9704903463