నా వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారు
సనాతన ధర్మాన్ని కించపర్చటం లేదని స్పష్టీకరణ
చెన్నై, మే 15: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని డీఎంకే యువ నేత ఉదయనిధి పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని కించపర్చడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల వస్తున్న విమర్శలకు లేదా బెదిరింపులకు తాను భయపడబోనని ఆయన స్పష్టం చేశారు. సనాతన ధర్మం అంటే సమాజంలో ఉన్న అసమానతలు, కుల వివక్ష అని, వాటిని తొలగించాలన్నదే తన ప్రధాన ఉద్దేశమన్నారు.
తమ పోరాటం కేవలం అణచివేతకు గురవుతున్న వర్గాల హక్కుల కోసమే తప్ప, భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి కాదని ఆయన వివరించారు. కాగా ఇటీవల అసెంబ్లీలో సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు వివిధ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉదయనిధి వివరణ ఇచ్చారు. ప్రజలను అగ్ర, నిమ్న వర్గాలుగా విభజించే కుల వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనను తాను వ్యక్తం చేశానని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలన్నారు. సనాతన ధర్మానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు.






