ఓటర్ల జాబితాలో అవకతవకలకు తావివ్వొద్దు
మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ రూరల్, జూన్ 12 (విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శుక్రవారం కొల్లాపూర్లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఆర్)పై బీఎల్‌ఓ లకు అవగాహన శిక్షణ శిబిరంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి హాజరయ్యారు.
రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వలస వెళ్లిన వారి పేర్లు, డబుల్ ఓట్లు వంటి అంశాలను గుర్తించి సరిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, సర్పంచులు తీసుకోవాలన్నారు. ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర శుక్రవారం కొల్లాపూర్కు చేరుకున్న సందర్బంగా జూపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ కలిసి జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. వారితో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






