22 August, 2026 | 6:58 PM

ఎస్‌ఐఆర్‌ నోటీసులకు భయపడొద్దు

22-08-2026 06:25 PM

- అర్హులైన ప్రతి ఒక్కరికే ఓటు హక్కు కల్పిస్తాం

- బిఎల్ఓలకు సరైన ఆధారాలు జత చేయండి

- 1,15,851 మంది ఓటర్లకు నోటీసులు.. బీఎల్‌వోల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన

- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, నోటీసులతో ఎవరు భయపడాల్సిన పనిలేదని అర్హులైన ఏ ఒక్కరి ఓటు హక్కు తొలగిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

2002 జాబితాతో మ్యాపింగ్‌ కాని 13,216 మంది, ఇతర వివరాల పరిశీలనలో మరో 1,02,635 మంది కలిపి మొత్తం 1,15,851 మంది ఓటర్లను గుర్తించి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. బీఎల్‌వోలతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతోందన్నారు. నోటీసులు అందినంత మాత్రాన ఓటు తొలగించినట్లు కాదన్నారు. ఓటర్లు తమ నోటీసులను పరిశీలించి అవసరమైన పత్రాలను సమర్పించాలని, సందేహాలుంటే సంబంధిత బీఎల్‌వోలను సంప్రదించాలని అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ కోరారు. మరిన్ని సందేహాలకు టోల్ ఫ్రీ నెంబర్, మండల స్థాయిలో ఎంపీడీవో, ఎమ్మార్వో డివిజన్ స్థాయిలో ఆర్డిఓ, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సి సెక్షన్, నేరుగా తాను కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. నోటీసుల అనంతరం హియరింగ్ ఆ తర్వాత కూడా ఓటరు జాబితాలో పేర్లు లేని వారికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి,  రాష్ట్ర ఎన్నికల అధికారిని సవాల్ చేస్తూ ఓటు హక్కు పొందే అవకాశం ఉందన్నారు. అనాధలు, ఇతరుల ఓటు నమోదు అంశాన్ని ప్రత్యేక ప్యాకేజ్ కింద ఓటు నమోదు ప్రక్రియ జరుగుతుంది అన్నారు.