14 August, 2026 | 4:32 PM

అన్నదాతలు తొందరపడొద్దు

18-06-2024 04:09 AM
  • సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే విత్తనాలు నాటాలంటున్న అధికారులు
  • ఇప్పటికే పత్తి, మొక్కజొన్న, కంది విత్తనాలు విత్తిన కొందరు రైతులు 
  • వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు

వర్షాలు ఊరిస్తుండడంతో ఖరీఫ్ సాగుపై అన్నదాతల్లో అయోమయం నెలకొంది. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోవడం రైతులను కలవరపెడుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పదిహేను రోజులు దాటుతున్నా ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. వికారాబాద్ జిల్లాలో గత పది రోజుల క్రితం కురిసిన రెండు మూడు వర్షాలకు కొందరు రైతులు తొందరపాటుతో విత్తనాలు విత్తారు. ఆ తర్వాత కొన్నిచోట్ల మాత్రమే చిరుజల్లులు కురుస్తుండటంతో విత్తనాలు విత్తేందుకు ఆటంకంగా మారింది. దీంతో రైతులు వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. 

వికారాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ఈ వానకాలం సీజన్‌లో ఇప్పటి వరకు భారీ వర్షం ఒక్కటి కూడా రాలేదు. ఇప్పటి వరకు వికారాబాద్ జిల్లాలో సగటున 11 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. 60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైతేనే విత్తనాలు విత్తడానికి అనువుగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ ఖరీఫ్‌లో పంటలు వేసే విషయంలో రైతులు తొందర పడొద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

ఊరిస్తున్న మేఘాలు.. 

గత వారం పది రోజులుగా ఆకాశంలో నల్లటి మేఘాలు ఊరిస్తున్నాయి కానీ వర్షం మాత్రం పడడం లేదు. గత ఐదు రోజులుగా ఊష్ణోగ్రతలు పెరగడం రైతన్నలను ఆందోళనకు గురిచేస్తోంది. తొలకరి వర్షాలకే కొం తమంది పత్తి, మొక్కజొన్న, కంది వంటి విత్తనాలను వేశారు. విత్తనాలు పెట్టిన నాటి నుం చి వర్షాలు లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. మరికొందరు రైతులు విత్తనాలు విత్తడానికి సీజన్ దాటిపోతుందనే ఉద్దేశంతో వర్షం రాక కోసం ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో ప్రధానంగా పత్తి, కంది, మొక్కజొన్న సాగు చేస్తుంటారు. ఈ మూడు పంటలను సీజన్ ప్రారంభంలో వేస్తేనే మంచి దిగుబడి వస్తుందని, ఏ మాత్రం ఆలస్యమైనా దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి 60 మిల్లీమీటర్ల వరకు వర్షాలు కురిస్తేనే పంటలు వేసుకునేందుకు అనువుగా ఉంటుందని వ్యవసాయశాఖ అధి కారులు చెబుతున్నారు. ప్రారంభపు వర్షాలకు విత్తనాలు వేయరాదని అంటున్నారు. జూన్ చివరి వరకు, జూలై మొదటి వారం లో కూడా కొన్ని రకాల విత్తనాలు వేయవచ్చని అంటున్నారు. 

వరి, పత్తి సాగుకు మొగ్గు..

యాదాద్రి భువనగిరి, జూన్ 17 (విజయక్రాంతి): సాగునీటి వనరులు అంతంత మాత్రమే ఉండే యాదాద్రి భువనగిరి జిల్లాలో పంటల సాగుకు రైతులకు వర్షాలే ఆధారం. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురిసి,పంటలు పండాలనే ఆశలతో వారం రోజులుగా కురుస్తున్న తొలకరి జల్లులకు రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. గతేడాది కురిసిన అరకొర వర్షా లకు తోడు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పైర్లు ఎండిపోయి పెట్టుబడి ఖర్చు కూడా రాక రైతులు నష్టపోయారు. ఈ ఏడాదైనా ప్రకృతి కరుణించాలని కోటి ఆశలతో దుక్కులు సిద్ధం చేసుకుంటున్నా రు. జిల్లాలో గతేడాది వానకాలంలో 3,09, 368 ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగు జరగగా, ఈ ఏడాది 4,28,850 ఎకరాలకు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

జిల్లాలో అధికంగా పత్తి, వరి సాగు చేయడం సంప్రదాయంగా మారింది. జిల్లాలో బోరు బావుల కింద ఉన్న పొలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత పత్తి సాగు చేయనున్నారు. ఇక కంది, పెసర, మినుము, తృణధాన్యాలు, నూనెగింజల సాగు తక్కువగా జరుగుతోం ది. జిల్లాలో కోతుల బెడద వంటి కారణాలతో వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపడం లేదు. అయితే, ఈ ఏడాది వర్షా లు సమృద్ధిగా కురుస్తాయనే వాతావరణ శాఖ అంచనాలతో రైతులు పత్తి సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దుక్కులు సిద్ధం చేస్తున్నారు. 

వర్షాలు పడితేనే..

సమృద్ధిగా వర్షాలు లేని కారణంగా విత్తనాలు వేయడానికి రైతులు తొందరపడొద్దు. కొన్ని రకాల విత్తనాలు ఈ నెల చివరి వరకు వేసుకోవచ్చు. వానలు రావడం మరింత ఆలస్యమైతే పెసర, మినుము వంటి పంటలు వేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సమృద్ధిగా వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలు వేయాలి. అయినా 30 శాతం మంది రైతులు తక్కువ వర్షాలకే విత్తనాలు వేసినట్లు గుర్తించాం. 

 గోపాల్, వికారాబాద్ జిల్లా 

వ్యవసాయాధికారి