ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం చేయవద్దు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, జూన్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాల అమల్లో అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ జిల్లా అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్‌ఎఫ్బీఎస్, చేయూత పథకాల అమలు, వర్షాకాల సన్నద్ధత, ఘన వ్యర్థాల నిర్వహణ, నిబంధనల అమలు, లైవ్ ఫేషియల్ రికగ్నిషన్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పూరి గుడిసెల ప్రతిపాదనలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామ స్థాయిలో క్షేత్ర పరిశీలనలు నిర్వహించి, నిర్మాణ అవసరాలకు అనుగుణంగా అంచనాలను రూపొందించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. వనమహోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అవసరమైన అంచనాలను ముందస్తుగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మొక్కల నాటడం, సంరక్షణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని సూచించారు.జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. చేయూత పథకం అమలులో ఎలాంటి జాప్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు.
గ్రామాల్లో డంపింగ్ యార్డుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి, తడి , పొడి వ్యర్థాలను వేర్వేరుగా నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. సంబంధిత అధికారులు వ్యవస్థ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండి నిర్దేశిత మార్గదర్శకాల మేరకు అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ ఎన్ వి గిరి, హౌసింగ్ పీడి విజయపాల్ రెడ్డి, డీపీఓ మురళి, డి ఆర్ డి ఓ దామోదర్ రెడ్డి, జడ్పీ సీఈఓ చందర్ నాయక్, సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓ లు , ఎంపీవో లు, ఏ పీ ఓ లు, పంచాయితీ సెక్రెటరీలు, తదితరులు పాల్గొన్నారు.






