12 June, 2026 | 1:18 AM

ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవ వేదన

12-06-2026 12:27 AM
  1. బదిలీపై వెళ్లిన గైనకాలజిస్టులు
  2. నర్సులు సైతం బదిలీపై వేరే జిల్లాలకు..
  3. గజ్వేల్ ఆసుపత్రిలో  ప్రసవాలకు డిమాండ్
  4. ఉన్న వైద్యులు, సిబ్బందిపై పెరిగిన భారం

గజ్వేల్, జూన్ 11: గజ్వేల్ నియోజకవర్గం లో పాటు పరిసర జిల్లాల రోగులకు, గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం ప్రసూతి విభాగంలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గజ్వేల్ లోని జిల్లా ప్రభు త్వ ఆసుపత్రిలో సూపరిండెంట్ గా  విధులు నిర్వహించిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అన్నపూర్ణ తో పాటు మరో సీనియర్ గైనకాలజిస్ట్ మంజుల, పీడియాట్రిక్ వైద్యులు డాక్ట ర్ సాయికిరణ్ ఇటీవల బదిలీపై ఇతర ప్రాం తాలకు వెళ్లడంతో పాటు, ప్రసూతి విభాగంలో పనిచేస్తున్న పలువురు స్టాఫ్ నర్సులు కూడా ఇతర జిల్లాలకు బదిలీ కావడంతో ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. 

ప్రతినెల 300 నుండి 400 వరకు ప్రసవాలు ఆసుపత్రిలో జరుగుతూ ఉంటాయి. వీటిలో అతి క్లిష్టమైన కేసులను  డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ మంజుల నిర్వహించారు.  గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి గతంలో వచ్చిన చిన్నపాటి సమస్యలున్న  గర్భిణీలను వేరే ఆసుపత్రులకు పంపించేవారు. డాక్టర్ అన్నపూర్ణ, మంజుల గజ్వేల్ లో  బాధ్యతలు చేపట్టిన తర్వాత లాప్రోస్కోపింగ్ ద్వారా కూడా గర్భిణీలకు ప్రసవాలు చేశారు. ఇప్పుడు వారు బదిలీ కాగా వారి స్థానంలో వైద్యులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. పైగా ఈ ఆసుపత్రిలో పనిచేసిన నర్సులు సైతం వివిధ జిల్లాలకు బదిలీ అయ్యారు.

గజ్వేల్ నియోజకవర్గంతో పాటు పరిసర మండలాల నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణులు ఈ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. వైద్యుల సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. గజ్వేల్ జిల్లా ఆసుపత్రికి మాతా శిశు ఆసుపత్రి తోడవడంతో  వివిధ జిల్లాల ప్రజలు ఇక్కడ ప్రసవాలు  చేయించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగిన స్థాయిలో వైద్యులు, నర్సులు లేకపోవడం వల్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది.

ప్రసూతి విభాగంలో అత్యవసర సేవలు, సాధారణ ప్రసవాలు, సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో పరిమిత సిబ్బందితో సేవలు అందించడం సవాలుగా మారిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా నిరంతర సేవలు అందించాల్సి రావడంతో వైద్యులు, నర్సులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ప్రసవాల సంఖ్యకు అనుగుణంగా గైనకాలజిస్టులు, స్టాఫ్ నర్సులను తక్షణమే నియమించాలని ప్రజలు, గర్భిణుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రసూతి సేవలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఖాళీలను భర్తీ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.