22 April, 2026 | 2:57 AM

చలివేంద్రాలు నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు

22-04-2026 01:16 AM
  1. అధికారులు నిత్యం చలివేంద్రాల నిర్వహణను పర్యవేక్షించాలి
  2. అమృత్ పథకం నిధులతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
  3. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 21, (విజయ క్రాంతి): నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలకు సిఫారసు చేస్తామని, కార్పొరేషన్ పరిధిలోని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను అధికారులు నిత్యం పర్యవేక్షించాలని కొత్త గూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ హెచ్చరించారు.  కార్పొరేషన్ కార్యాలయంలో తాగునీటి సరఫరా,  చలివేంద్రాల నిర్వహణపై మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని నిత్యం అందుబాటులో ఉంచా లని, నీటిని అందించే వర్కర్లు చలివేంద్రాల వద్దే ఉండి సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం పట్టణంలోని 11 ప్రధాన సెంటర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని,

ప్రజల అవసరాల దృష్ట్యా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రత్యేక కృషితో అమృత్ స్కీం కింద మంజూరైన నిధులతో పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు. ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రతి చుక్క నీరు సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన పునరుద్ఘాటించారు.