3 August, 2026 | 5:27 AM

కుటుంబం పరువు తీయకు

22-05-2024 02:41 AM

వచ్చి పోలీసులకు లొంగిపో

సిట్ దర్యాప్తునకు సహకరించు

ప్రజ్వల్‌కు మాజీ సీఎం కుమారస్వామి సూచన

బెంగళూరు, మే 21: మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి ఆరోపణల కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఆయనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారగా కర్ణాటక ప్రభుత్వం ఈ కేసులో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, వీడియోలు వైరల్ నేపథ్యంలోనే ప్రజ్వల్ జర్మనీకి వెళ్లడం వివాదాస్పదంగా మారింది. అయితే, ప్రజ్వల్ బాబాయి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. ప్రజ్వల్‌ను భారత్‌కు వెంటనే తిరిగి రావాలని బహిరంగంగా కోరారు.

లైంగిక ఆరోపణల కేసులో దర్యాప్తులో సిట్‌కు సహకరించాలని సూచించారు. లేదంటే ప్రజలు తమ కుటుంబాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారని, ఇది తమ పరువుకు భంగం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ఎదుట ప్రజ్వల్‌ను ఇండియా రావాల్సిందిగా కోరుతున్నా. ఆయన ఏ దేశంలో ఉన్నా భయం లేకుండా తిరిగి రావాలి. ఎన్నాళ్లు ఇలా దాచుకుని తిరుగుతావు? మీ తాత, మాజీ ప్రధాని దేవెగౌడపై గౌరవం ఉంటే వెంటనే భారత్‌కు వచ్చి రెండు రోజుల్లో పోలీసులకు లొంగిపో. అప్పుడే ఈ సమస్యకు ఓ ముగింపు వస్తుంది.

మన కుటుంబం గురించి ఆలోచించి ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకుండా చూడాలి. లక్షల మంది పార్టీ కార్యకర్తలు నీకు ఓటేశారు. ఈ విషయంలో బాధితులకు నేను బహిరంగ క్షమాపణలు చెబుతున్నా. వారి బాధను నేను అర్థం చేసుకోగలను. మా కుటుంబాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు టార్గెట్ చేస్తోంది. కానీ, పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోరాడుతున్నాంఅని కుమారస్వామి చెప్పారు.