మళ్లీ మోదీకే పట్టం!
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం
ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేదని వ్యాఖ్య
303 సీట్లకు అటుఇటుగా బీజేపీ గెలుచుకునే అవకాశం
రాహుల్ గాంధీపై ప్రజల్లో నమ్మకం కలగలేదు
ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశాలను కాంగ్రెస్ చేజార్చుకుంది
న్యూఢిల్లీ, మే 21: సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఇంకో రెండు విడతల పోలింగ్ పూర్తయితే దేశ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలిసిపోతుంది. అయితే ఎవరు అధికారాన్ని చేపడుతారనే విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత లేదని, మోదీ ప్రధాని అభ్యర్థిత్వంపై కూడా ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. కాకపోతే ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో కాస్త నిరాశ, నిస్పృహ, హామీలు అమలు కాలేదనే అసహనం తప్ప భారీగా వ్యతిరేకత లేదని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం కావొచ్చని, 303 సీట్లకు అటుఇటుగానే బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ‘ఈ వ్యక్తి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారుతాయని అనుకున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుంది. కానీ రాహుల్ గాంధీ వస్తే పరిస్థితులు బాగుపడుతాయని పెద్దగా ప్రజలు భావించట్లేదు. ఆయన మద్దతు దారులు చెప్పొచ్చు. కానీ విస్తృతంగా చూసుకుంటే అలాంటి ట్రెండ్ కనిపించట్లేదు’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
చేజేతులారా చేసుకున్నదే
ప్రధాని మోదీ ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడినప్పుడు లాభం పొందే విషయంలో చాలాసార్లు అవకాశాలను ఇండియా కూటమి చేజేతులారా పోగొట్టుకుందని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రతిపక్షాలు కాడి ఎత్తేశాయని, తిరిగి క్రియాశీలం అయ్యే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిందని వివరించారు. ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా పెద్ద వైఫల్యం అని, అది బీజేపీకి విమర్శించడానికి పెద్ద ఆయుధంగా మారిందని చెప్పారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి.. ఆ తర్వాత నవంబర్‌లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఏకతాటిపై నిలవలేకపోయాయని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో ఆరు సీట్ల విషయంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ విబేధించిన విషయాన్ని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపిణీలో జరిగిన విబేధాల కారణంగా ఆమె ఒంటరిగానే బరిలో దిగడం కూటమికి నష్టం చేసిందని విశ్లేషించారు. 2015, 2016 సమయంలో బీజేపీ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందని, అప్పుడు కాంగ్రెస్ పుంజుకోవడానికి మంచి అవకాశం ఉండేనని చెప్పారు. కాగా, ప్రతిపక్షం బలంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిదని, ఎన్నికల తర్వాత ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా గట్టి ప్రతిపక్షం ఉంటుందని అన్నారు.






