3 August, 2026 | 7:07 AM

ఇద్దరిని చంపినవాడికి పిజ్జా దావత్

22-05-2024 02:40 AM

పుణెలో కారుతో గుద్దిచంపిన యువకుడికి.. పోలీసుల రాచమర్యాదలు

దగ్గరుండి సపర్యలు చేసిన ఎన్సీపీ ఎమ్మెల్యే

నిందితుడి తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు

పుణె, మే 21: అర్ధరాత్రి తప్పతాగి ఖరీదైన పోర్షే కారును గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిపి అమాయకులైన ఇద్దరు వ్యక్తులను చంపిన ఓ ధనవంతుడి బిడ్డకు పోలీసులు చేసిన సేవలు మహారాష్ట్రను ఇప్పుడు కుదిపేస్తున్నాయి. ఆదివారం రాత్రి పుణెలో కన్నుమిన్న కానక ఇద్దరిని పొట్టనపెట్టుకొన్న 17 ఏండ్ల యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగానే అక్కడి పోలీసులంతా పోటీపడి సేవలు చేసిన విషయం బయటపడింది.

ఆ యువకుడు అలా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడో లేదో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఆగమేఘాలమీద స్టేషన్‌కు పరుగెత్తి నిందితుడికి అండగా నిలిచాడని తేలింది. ఈ కేసులో అతడికి అరెస్టు చేసిన 14 గంటల్లోనే బెయిల్ రావటంపైనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 17 ఏండ్ల యువకుడు తప్పతాగి పుణెలోని కల్యాణీ నగర్ ప్రాంతంలో ముందుగా వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో అనిష్ అవాధియా, అశ్విని కోస్తా అనే భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల తీరును శివసేన (యూబీటీ) వర్గం నేత సంజయ్ రౌత్ తీవ్రంగా తప్పుపట్టారు.

పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశా రు. ‘ఇద్దరు అమాయకులను పొట్టనపెట్టుకున్న ధనవంతుల బిడ్డకు పుణె పోలీసులు సహాయం చేశారు. అతడికి పోలీస్ స్టేషన్‌లో పిజ్జా, బర్గర్‌లు వడ్డించటంలో మీ ఉద్దేశం ఏమిటి? అతడు మద్యం తాగుతున్న వీడియో బయటకొచ్చింది. అయినా పోలీసులు అతడికి సహాయం చేస్తూనే ఉన్నారు. పోలీస్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి.

ఆయన నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరి చంపిన వాడికి రెండుగంటల్లోనే బెయిల్ వచ్చింది. అతడు మద్యం తాగుతున్నట్టు స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నా.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో నెగెటివ్ ఎలా వచ్చింది? నిందితుడికి ఎవరు సహాయం చేస్తున్నారు? ఈ పోలీస్ కమిషనర్ ఎవరు? అతన్ని వెంటనే తప్పించాలి. లేదంటే పుణె ప్రజలు రోడ్డుపైకి వస్తారు’ అని హెచ్చరించారు.

నిందితుడి తండ్రి అరెస్టు

ఈ కేసులో నిందితుడి తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పేరుమోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన అతడిని ఔరంగాబాద్‌లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. విమర్శల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును ఎరవాడ పోలీస్ స్టేషన్ నుంచి క్రైమ్‌బ్రాంచ్‌కి బదిలీ చేశారు. నిందితుడికి మద్యం విక్రయించిన బార్ యజమానులకు కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, కేసు దర్యాప్తు తీరుపై మృతుల కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్రమాదం కాదని, హత్య అని ఆరోపించారు.